తెలంగాణ రాష్ట్ర పండుగల జాబితాలో మేడారం పండుగ తొలిస్థానంలో ఉంటుంది. ఇప్పటికే సర్కారు రాష్ట్ర పండుగగా గుర్తించింది. కుంభమేళా తరహాలో ఈ జాతరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించుకుంది సర్కారు.  గొప్పలు బాగానే చెప్పుకున్నారు కానీ.. అసలు ముచ్చట మరచిపోయారు. అయినదానికి కానిదానికి ఉదారంగా సెలవిచ్చే తెలంగాణ సర్కారు మేడారం జాతరకు ఎందుకు సెలవులియ్యలేదో అంతుచిక్కడంలేదు. ఈ విషయంలో ఆదివాసీ బిడ్డలు, మేడారం భక్తులు మస్త్ బాధపడుతున్నారు.  కోటి మంది వస్తారు అని అంచనా వేస్తున్న ఈ జాతర విషయంలో సర్కారు ఎందుకిలా చేస్తుందని నిలదీస్తున్నారు. మరోవైపు ఈ పండుగను జాతీయ పండగగా గుర్తించాలని డిమాండ్ కూడా చేస్తున్న తెలంగాణ సర్కారు జాతరకు సెలవులు ఇచ్చుడు మాత్రం మరచిపోయింది. మేడారం జాతర అంటే ఊళ్లకు ఊళ్లే కన్నెపెళ్లి బాట పడుతాయి. కానీ ప్రభుత్వం మాత్రం సెలవు ఇవ్వకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. కనీసం పాఠశాలకు కూడా సెలవులు లేకపోతే ఎట్లా జాతరకు పోవుడు అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. మన సర్కారే గుర్తిచకపోతే కేంద్రం ఏమి గుర్తింపు ఇస్తది అని జనాలు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే నాలుగు రోజుల పాటు జాతర సెలవులు ప్రకటించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సంక్రాంతి ముందు వెనుక కూడా సెలవులు ఇచ్చి ఉదార స్వభావాన్ని చాటుకున్న తెలంగాణ సర్కారుకు ఇంటి పండుగకు సెలవులు ఎందుకు ఇస్తలేదని ప్రశ్నిస్తున్నారు. ఆదివాసీల పండుగ కాబట్టే సెలవులు ఇచ్చడు మరచిపోయిర్రా అని అడుగుతున్నారు.

ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇవాళ్టి నుండి మొదలైంది.  తెలంగాణ కుంభమేళగా పేరొందిన ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కానీ రెండేళ్లకోసారి జరిగే  ఈ సాంస్కృతిక జాతర కోసం సెలవులివ్వడాన్ని మరిచింది కేసిఆర్ సర్కారు. ఈ నెల 31 నుండి నాలుగు రోజుల పాటు సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందని అధికారికంగా ప్రకటించిన సర్కారు వాటిని విజయవంతం చేసే చర్యలను మాత్రం మరిచింది.   

ప్రతి జాతీయ, రాష్ట్ర పండుగలకు, కార్యక్రమాలకు ముందొక రోజు వెనుక ఒకరోజు సెలవులు ప్రకటించే తెలంగాణ ప్రభుత్వం, ఆదివాసీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే జాతరకు మాత్రం ఇంతవరకు సెలవులు ప్రకటించలేకపోవడం పట్ల ఆదివాసీ బిడ్డలే కాదు యావన్మంది మేడారం భక్తులు కూడా మస్తు బాధపడుతున్నారు.

తెలంగాణ లో గిరిజనులు, ఆదివాసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మేడారం జాతర ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుకల్లో కేవలం తెలంగాణ నుండే కాకుండా పక్క రాష్ట్రాలనుండి భక్తులు అధికంగా వస్తుంటారు. అమ్మవార్ల దర్శనం చేసుకుని అక్కడే వంటా వార్పు చేసుకుని కుటుంబాలతో ఆనందంగా గడుపుతుంటారు. ఒక్కో కుటుంబం అయితే జాతర జరిగే నాలుగు రోజులు అక్కడే ఉంటుంటారు. అయితే ఈ జాతరలో పిల్లా పాపలతో కలిసి పాల్గొనాలని భావించిన భక్తులు ప్రభుత్వం అధికారిక సెలవులు ప్రకటిస్తుంది కదా.. హాయిగా వెళ్లిరావొచ్చని భావించారు. అయితే ఆ విధంగా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో వీరంతా ఉసూరుమంటున్నారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం వివిధ జిల్లాల నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. బుధవారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో బస్సులు మేడారం పోతున్నాయి.. కానీ అవన్నీ ఖాళీగానే పోతున్నాయి. దానికి కారణం తెలంగాణ సర్కారు సెలవు ప్రకటించలేదని భక్తులు బాధతో చెబుతున్నారు.