మెదక్: వివాదంలో ఉన్న భూమిని రిజిష్టర్ చేయడానికి కోటీ 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర మాజీ తాహిసిల్దార్ నాగరాజుపై విచారణ జరుగుతుండగానే అటువంటి సంఘటనే మరోటి బయటపడింది. కోటీ 12 లక్షల లంచం తీసుకోవడానికి సిద్ధపడిన మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) అధికారులు పట్టుకున్నారు.

తొలి విడత 40 లక్షల రూపాయలు తీసుకుంటూ నగేష్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివాదంలో ఉన్న భూమి విషయంలో నగేష్ లంచం తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. లంచం డబ్బులు ఇవ్వడేమోననే అనుమానంతో లంచం ఇవ్వజూపిని వ్యక్తితో నగేష్ ఒప్పంద పత్రం కూడా రాయించుకున్నాడు.

మాచవరంలోని నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో బ్లాంక్ చెక్కులు, ఒప్పంద పత్రాలు లభించాయి. వివాదంలో ఉన్న భూమికి సంబంధించిన పత్రాలు కూడా ఏసీబీ అధికారులకు చిక్కినట్లు తెలుస్తోంది. 

నగేష్ నివాసంలో బుధవారం సాయంత్రం వరకు సోదాలు జరిగే అవకాశం ఉంది. సోదాల తర్వాత నగేష్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉంది. వివాదాస్పద భూమికి సంబంధించిన వివరాలను కూడా ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో ఈలోగా అందినంత దోచుకోవాలనే ఉద్దేశంతో నగేష్ ఆ పనికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

నర్సాపూర్ డివిజిన్ లోని చిప్పలకుర్తి గ్రామంలో వివాదంలో ఉన్న 113 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇచ్చేందుకు కోటీ 12 లక్షల రూపాయల లంచాన్ని నగేష్ డిమాండ్ చేశాడు. లంచం డబ్బుల కోసం కోటీ రూపాయల ఆస్తులకు సంబంధించి ఒప్పంద పత్రం రాయించుకున్నాడు. ఆడియో క్లిప్ లతో సహా నగేష్ ఎసీబీ అధికారులకు చిక్కాడు.

నగేష్ నివాసంలోనే కాకుండా 12 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎకరానికి లక్ష రూపాయల చొప్పున నగేష్ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. లంచంలో భాగంగా రూ. 72 లక్షల విలువైన భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని డీల్ కుదుర్చుకున్నాడు.