వారం రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఎంబిఎ విద్యార్థిని శ్వేత కేసును పోలీసులు చేధించారు. ఆమె మృతికి కారణమైన భరత్ అను యువకున్ని చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుండి శ్వేత ఎలా మృతిచెందిదన్న విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తపల్లి గ్రామానికి చెందిన బోదనపు శ్వేత చౌటుప్పల్ లోని ఓ కాలేజీలో ఎంబీఎ చదువుతోంది. ఆమెకు స్నేహితుల ద్వారా నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన భరత్ పరిచయబయ్యాడు. ఇతడు మొదట బాగానే ఉన్న తర్వాత ప్రేమ పేరుతో శ్వేతను వేధించడం మొదలుపెట్టాడు. అయితే శ్వేత మాత్రం ఇతడి ప్రేమను అంగీకరించలేదు. దీంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు.

అయితే శ్వేతకు కొద్దిరోజుల క్రితం వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న భరత్ శ్వేతను కలవడానికి కాలేజీకి వెళ్లాడు. అక్కడ గొడవ చేసి శ్వేతను బైక్ పై ఎక్కించుకుని బలవంతంగా బైటికి తీసుకెళ్లాడు. అయితే బైక్ పైనే వీరిద్దరు పెనుగులాడుకోవడంతో అదుపుతప్పి శ్వేత జారిపోయి కింద పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన శ్వేతను భరత్ ఆస్పత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించి అక్కడి నుండి వెళ్లిపోయాడు.

అయితే శ్వేత తలకు బలమైన గాయమవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు భరత్ ను అరెస్ట్ చేశారు.అతడిపై కిడ్నాప్ కేసుతో పాటు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.