మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ పై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. బొంతు రామ్మోహన్ రాజీనామా చేస్తున్నారంటూ వార్తలొచ్చాయి. దీంతో ఆయన స్పందించారు. తన రాజీనామా వార్తల్లో ఏమాత్రం నిజంలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా తాను రాజీనామా చేస్తున్నట్లు కథనాలు పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు జిహెచ్ఎంసి నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన కింద చదవండి.

తాను రాజీనామా చేశానంటూ, బీసీ లకు చెందిన వ్యక్తిని కాబట్టే తన పేరు వెయలేదంటూ తాను పేర్కొన్నట్టు నేడు కొన్ని సోషల్ మీడియా సంస్థలలో వచ్చిన తప్పుడు వార్తలపై కఠిన  చర్యలను తీసుకోవాలని కోరుతూ  నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేడు సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మెట్రో రైల్ ప్రారంభోత్సవ౦ సందర్బంగా అవమానం జరిగిందని ఈ విషయం లో తీవ్ర మనస్తాపానికి లోనై మేయర్ పదవికి రాజీనామా చేశానని నేడు ఉదయం నుండి పలు సోషల్ మీడియాల్లో తప్పుడు వార్తలు తనపై వస్తున్నాయని, ఈ తప్పుడు వార్తలను పోస్ట్ చేసిన వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని కోరుతూ సైబర్ నేర విభాగం అడిషనల్ డీసీపీ రఘువీర్ కు ఫిర్యాదు చేసినట్టు మేయర్ రామ్మోహన్ తెలిపారు. తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. తెలంగాణా తో పాటు హైదరాబాద్ పురోభివృద్ధికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, యువమంత్రి కేటీఆర్ నేతృత్వం లో చిత్తశుద్ధితో పనిచేయనున్నట్టు మేయర్ బొంతు రామ్మోహన్ ఒక ప్రకటనలో స్పష్టంచేశారు.