తెలంగాణ ఎన్నికల పుణ్యమా అని 80ల నాటి హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుంది. వాళ్లు ఎవరో కాదు నందమూరి నటసింహం బాలయ్య.. ఫైర్‌బ్రాండ్ విజయశాంతి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ జంట ఒకే వేదికపైకి రానుందని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తెలుగుతెరపై ఈ ఇద్దరిది హిట్ కాంబినేషన్.. 1984 నుంచి 1994 వరకు వీరిద్దరూ కలసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశాయి. అయితే అవకాశాలు తగ్గిన తర్వాత విజయశాంతి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి.. ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు.

తెలంగాణ కోసం ‘‘ తల్లి తెలంగాణ’’ పార్టీ పెట్టి ఆ తర్వాత దానిని టీఆర్ఎస్‌లో వీలినం చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ గూటికి చేరారు. అటు బాలకృష్ణ తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. పార్టీ తరపున ప్రచారం చేస్తూ వచ్చిన ఆయన గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

నిన్న మొన్నటి వరకు బద్ధవైరం ఉన్న వేరు వేరు పార్టీల్లో ఉన్న బాలయ్య, విజయశాంతి.. తెలంగాణ ముందస్తు ఎన్నికల కారణంగా తిరిగి కలవబోతున్నారు. ఈసారి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా దశాబ్ధాల నాటి వైరాన్ని సైతం పక్కనబెట్టాయి టీడీపీ, కాంగ్రెస్.. ఈ రెండు పార్టీల సారథ్యంలో మహాకూటమి ఏర్పాటు అయ్యింది.

విజయశాంతిని కాంగ్రెస్ తన ప్రధాన అస్త్రంగా భావిస్తోంది. ప్రత్యర్థులపై వాగ్భాణాలు సంధించడంలో ఆమె దిట్ట..దీంతో రాములమ్మను కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపెయినర్‌గా నియమించింది. ఆమె మొత్తం 40 రోజుల్లో 90 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు..

మరోవైపు తెలంగాణలో ఉనికిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ.. ఈ ఎన్నికల్లో బాలయ్యతో ప్రచారం చేయిస్తోంది. ఆయన ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఇద్దరు మహాకూటమిలో ఉండటంతో ఒకే వేదికపైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది ఎప్పుడు అనేది త్వరలోనే తెలియనుంది.