బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనపై బిపర్‌జాయ్ తుఫాన్ ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పర్యటనలో మార్పులు చోటు చేసుకోవడం కానీ, రద్దు కానీ అయ్యే సూచనలు వున్నాయి.
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పర్యటనపై బిపర్‌జాయ్ తుఫాన్ ఎఫెక్ట్ పడింది. తుఫాన్‌పై ఉన్నత స్థాయి సమీక్షలు, అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు టట్‌లో వుండటం, తుఫాను సహాయక చర్యలపై ఆయన బిజీగా వుంటున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే హైదరాబాద్ పర్యటన లేకుండా నేరుగా ఖమ్మం సభకైనా రావాలని రాష్ట్ర బీజేపీ నేతలు ఆయనను కోరుతున్నారు. అయితే దీనిపై హోంమంత్రి కార్యాలయం స్పందించాల్సి వుంది. ఈ మేరకు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
కాగా.. కొద్దినెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతలను , కేడర్‌ను సమాయత్తం చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 15న అమిత్ షా ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. బుధవారం అర్ధరాత్రికి అమిత్ షా హైదరాబాద్ రావాల్సి వుంది.
ALso Read: బిపర్ జోయ్ తుఫాన్ ను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు: అమిత్ షా
గురువారం ఉదయం ముఖ్యనేతలతో సమావేశం కావడంతో పాటు దర్శకుడు రాజమౌళిని ఆయన కలవాల్సి వుంది. సాయంత్రం హెలికాఫ్టర్‌లో భద్రాచలానికి చేరుకుని శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకుంటారు. ఖమ్మం నగరంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి.. బహిరంగ సభలో పాల్గొనాల్సి వుంది. అయితే ప్రస్తుతం బిపర్‌జాయ్ తుఫాన్ నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటనపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
