భారత చైనా సరిహద్దులో, చైనా దుష్టనీతి వల్ల అమరుడైన భారతీయ కల్నల్ సంతోష్ బాబు స్వస్థలం సూర్యాపేటలో విషాధచాయలు అలుముకున్నాయి. ఆయనను గుర్తుచేసుకుంటూ, ఆయన అమరత్వం అందరికి గుర్తిండిపోయేలా, ఆయన వీరమరనాన్ని తలుచుకుంటూ సూర్యాపేటలో సంతోష్ ఫొటోతో మాస్కులు పంచుతున్నారు. 

కరోనా కష్టకాలంలో ప్రజలందరు కూడా మాస్కులను ధరిస్తూ, భౌతికదూరంపాటిస్తు తమను తహము రక్షించుకుంటున్న తరుణంలో, అందునా ఒకప్పటి కరోనా హాట్ స్పాట్ సూర్యాపేటలో ఇలా మాస్కులు పంచడాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. 

తమ ఊరి యోధుడిని తాము ఈ విధింగా గుర్తుంచుకుంటూ, గర్వంతో మాస్కులను ధరిస్తామని ప్రజలు చెబుతున్నారు. రేపు సంతోష్ అంత్యక్రియల సమయంలో అందరం ఇదే మాస్కులను ధరిస్తామని అంటున్నారు. 

కల్నల్ సంతోష్ బాబు సూర్యాపేట జిల్లా వాసి. సూర్యాపేట లోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేసాడు. ఆ తరువాత కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశపరీక్ష రాసి అందులో ఉత్తీర్ణుడయి విజయనగరం జిల్లా కోరుకొండలోని సైనిక పాఠశాలలో 6వ తరగతి నుండి 12వతరగతి వరకు విద్యను అభ్యసించాడు. 

చిన్నప్పటినుండి సైన్యంలో చేరాలని కలలుగన్న సంతోష్ బాబు అందుకు తగ్గట్టుగానే కోరుకొండ సైనిక్ స్కూల్ లో చేరాడు. ఆతరువాత ఎన్డీయే ఎగ్జామ్ క్లియర్ చేసి పూణే ఎన్డీఏ లో డిగ్రీ పూర్తి చేసాడు. ఆతరువాత ఆఫీసర్ స్థాయి అధికారిగా డెహ్రాడూన్ లో ట్రైన్ అయ్యాడు. 

ట్రైనింగ్ పూర్తయిన అనంతరం ఫస్ట్ పోస్టింగ్ జమ్మూలో వచ్చింది. అతి చిన్న వయసులోనే సంతోష్ కల్నల్ స్థాయికి ఎదిగారు. 2004లో ఆర్మీలో చేరిన సంతోష్ బాబు, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, పుల్వామా ఇలా అనేక ప్రాంతాల్లో పనిచేసారు. 

విధుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపి గోల్డ్ మెడల్స్ సాధించారు.కుప్వారాలో ముగ్గురు పాకిస్తానీ ముష్కరులను మట్టుబెట్టి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతులమీదుగా ప్రశంసాపత్రాన్ని, మెడల్ ని కూడా పొందారు. 

16 బీహార్ రెజిమెంట్‌కు కమాండెంట్ అధికారిగా సంతోష్ విధులు నిర్వర్తిస్తున్నారు.  మార్చిలో సంతోష్ కుమార్‌కు హైదరాబాద్‌కు బదిలీ  అవగా...కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల కొత్తవారు వచ్చేదాకా అక్కడే డ్యూటీ చేయవలిసిందిగా ఆదేశాలు వచ్చాయి. దీనితో అక్కడే విధుల్లో ఉండిపోయాడు సంతోష్.