ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిన వారికి నివాస స్థానం మురికివాడలే.. నగరంలోని పలు ప్రాంతాల్లో చిన్నా, పెద్దా కలిపి వందల సంఖ్యలో మురికివాడలు ఉన్నాయి. రెక్కాడితే కాని డొక్కాడని ఈ జనానికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే నాణ్యమైన వైద్యం చేయించుకోవడం అందని ద్రాక్షే.

ఇలాంటి వారికి నేనున్నానంటూ బాసటగా నిలుస్తోంది హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్. మసీదునే హెల్త్ సెంటర్‌గా మార్చి అన్ని మతాల వారికి ఉచిత వైద్యం అందిస్తోంది. నగరంలోని మస్జీద్ ఈ ఇషాక్ మసీదును కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా మార్చి ఇక్కడి నుంచే పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తోంది.

దీనిపై హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ముజ్‌తాబ్ అస్కారీ మాట్లాడుతూ.. ఈ మసీదు తొమ్మిది మురికివాడలకు కేంద్ర స్థానంలో ఉందని.. ఇక్కడికి ఎవరైనా సులభంగా చేరుకుంటారని తెలిపారు.

దీని ముఖ్యోద్దేశం ప్రభుత్వ వైద్యశాలలకు చేరుకోలేని వారికి వైద్య సేవలు అందించడమేనన్నారు. ఈ హెల్త్ కేర్ సెంటర్‌కు జనం నుంచి మంచి ఆదరణ లభిస్తోందని.. రోజుకు 40 నుంచి 50 మంది ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. దూరం నుంచి ఇక్కడికి వచ్చేవారి కోసం రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేశామన్నారు.

గత 13 ఏళ్లుగా వైద్య రంగంలో ఉంటూ... 30 ఆసుపత్రుల్లోని నిపుణులైన సిబ్బంది చేత తమ ఫౌండేషన్ పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తోందని హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ మేనేజర్ ఫరీద్ తెలిపారు. ఇక్కడ కుల మతాల ప్రస్తావన లేదని అన్ని మతాల వారికి వైద్య సహాయం అందుతుని ఆయన స్పష్టం చేశారు.