తమ కుమారుడి హత్య కేసులో రాజీ కుదుర్చుకోవాల్సిందిగా తమపై మారుతీ రావు బెదిరింపులకు పాల్పడుతున్నాడని మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ తండ్రి బాలస్వామి ఆరోపిస్తున్నారు. మారుతీరావు తన అనుచరులను ఇంటికి పంపి మరీ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అయితే.. తాను రాజీకి ఒప్పుకోనని, అవసరమైతే చావడానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ప్రణయ్‌ హత్య కేసును విచారించాలని డిమాండ్‌ చేశారు. గతేడాది మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని అతి దారుణంగా కత్తితో నరికి నడి రోడ్డుపై హత్య చేసిన సంగతి తెలిసిందే. కూతురు కులాంతర వివాహాన్ని చూసుకోవడం సహించలేని మారుతీరావు.. ప్రణయ్ ని హత్య చేయించాడు.

ప్రణయ్, అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రణయ్‌ది షెడ్యూల్డ్‌ కులానికి (మాల) చెందిన మధ్యతరగతి కుటుంబం. అమ్మాయిది వైశ్య సామాజిక వర్గం. ఆమె తండ్రి స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి అని స్థానికులు చెబుతున్నారు.

తమ మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కక్షతో అమృత తండ్రి తిరునగరు మారుతిరావే కిరాయి హంతకులతో ప్రణయ్‌ని హత్య చేయించాడు. ఈ కేసులో పోలీసులు మారుతీరావును ఏ1గా, అతని తమ్ముడు శ్రవణ్‌ను ఏ2గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఆ సమయంలో అమృత గర్భవతి కావడంతో.. చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా... నరికి చంపేశారు.

కాగా... అమృతకు కొద్ది రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. తన అత్తమామలతో కలిసి ఆమె మిర్యాలగూడలోనే ఉంటోంది. తన భర్తను చంపిన వారికి కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా కేసు వెనక్కి తీసుకోవాలని మారుతీరావు అనుచరులు బెదిరింపులకు పాల్పడటం గమనార్హం.