పెళ్లయి నాలుగు రోజులు కాకముందే నవవధువు ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెలితే.. సికింద్రాబాద్ కళాసీగూడకు చెందిన పరమేశ్వర్, షీమాదేవి దంపతుల రెండో కుమార్తె మనీషాను ఈ నెల 22న నాంపల్లికి చెందిన కృష్ణశర్మకిచ్చి వివాహం జరిపించారు.

సికింద్రాబాద్‌లోని సిక్‌వాలా సమాజ్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం మరో కార్యక్రమం ఉండటంతో మనీషాను పుట్టింటికి తీసుకుని వచ్చారు.  ఆ రోజు రాత్రి కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో పగిరిరథం అనే కార్యక్రమంల జరిగింది.

ఇంట్లో పండగ వాతావరణం ఉండటంతో సందడిగా ఉంది. ఈ క్రమంలో మనీసా స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌లో బకెట్‌లో హీటర్ పెట్టుకుంది. నీళ్లు వేడి అయ్యాయో లేదో చూసేందుకు హీటర్‌ను స్విచ్ ఆఫ్ చేయకుండా బయటకు తీసింది. ఆ సమయంలో హీటర్ ఆమె నడుముకు తగలడంతో కరెంట్‌ షాక్‌కు గురైంది.

బాత్‌రూమ్ నుంచి కేకలు వినిపించడంతో కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మనీషా మరణించినట్లు వైద్యులు తెలిపారు. పెళ్లి తంతు ఇంకా ముగియకుండానే నవవధువు మృతిచెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త బోరున విలపించడం పలువురిని కలచివేసింది.