హైదరాబాద్ నాచారంలో వివాహిత ఫేస్‌బుక్‌ లైవ్‌ పెట్టి మరి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ ఘటన వెనక కుటుంబ సమస్యలు, అత్తింటివారి వేధింపులే కారణమనే ప్రాథమికంగా తెలుస్తోంది.

హైదరాబాద్ నాచారంలో వివాహిత ఫేస్‌బుక్‌ లైవ్‌ పెట్టి మరి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ ఘటన వెనక కుటుంబ సమస్యలు, అత్తింటివారి వేధింపులే కారణమనే ప్రాథమికంగా తెలుస్తోంది. బాధితురాలు భర్త మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో.. ఆమె కొంతకాలంగా తీవ్ర మనోవేదనకు గురైనట్టుగా ఆమె తల్లిదండ్రులు తెలిపారు. వివరాలు.. బాధిత యువతి సనాకు 2019లో రాజస్థాన్‌కు చెందిన రాజ్‌పుత్‌ యువకుడు హేమంత్‌తో వివాహం జరిగింది. తొలుత సనా, హేమంత్‌లు ప్రేమించుకున్నారు. అయితే మతం మారతానని ముందుకొచ్చిన హేమంత్.. సన్నా తండ్రిని ఒప్పించి ఆమెను వివాహం చేసుకున్నాడు. తన పేరును షంషేర్‌గా మార్చుకున్నాడు.

ఈ వివాహం హేమంత్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. అయితే ఈ దంపతులకు ఒక బాబు జన్మించాడు. అయితే కొంతకాలానికి వారి కాపురలంలో కలహాలు ఏర్పడ్డాయి. సూఫీ ఖాన్ అనే యువతితో హేమంత్ వివాహేతర సంబంధం ఏర్పడిందని సనా తండ్రి ఆరోపించారు. ఈ క్రమంలోనే సనా, హేమంత్‌ల మధ్య గొడవలు జరిగాయి. సూఫీ ఖాన్‌తో తిరుగుతూ.. సనాను హేమంత్ వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే సనా నాచారం పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఆ తర్వాత ఇరు కుటుంబాలు చర్చలతో వివాదం సద్దుమణిగింది. 

ఆ తర్వాత సనా, హేమంత్ దంపతులు వారి కొడుకుతో కలిసి రాజస్థాన్‌ వెళ్లిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కొన్ని రోజులకే సుఫీ ఖాన్ విషయంలో దంపతుల మధ్య మళ్లీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో సనా కొడుకుని తీసుకుని నాచారం వచ్చేసింది. అయితే భర్తకు దూరంగా ఉంటున్న సనా.. భర్తను, మామను ఫేస్‌బుక్‌లో లైవ్‌పెట్టి మరీ ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అయితే సనా ఎంతసేపటికి తన గది తలుపులు తీయకపోవడంతో ఆమె తండ్రి వెళ్లి చూడగా.. ఆత్మహత్య చేసుకుని కనిపించింది. అయితే సనా ఆత్మహత్యకు ఆమె భర్త, అత్తింటి వారి వేధింపులే కారణమని ఆమె తండ్రి ఆరోపిస్తున్నాడు. హేమంత్, సూఫీ ఖాన్‌ల మధ్య జరిగిన చాటింగ్, కలిసి దిగిన ఫొటోలు, వివాహేతర సంబంధానికి సంబంధించిన ఆధాలు తన వద్ద ఉన్నాయని చెబుతున్నాడు. హేమంత్ కుటుంబంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. ఇక, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సనా ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 


(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)