అతడో పోలీస్ అధికారి. తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన అతడే తప్పుడు దారిని ఎంచుకున్నాడు. ఒకరిని తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు.అయితే దీని గురించి ప్రశ్నించడమే అతడి భార్య తప్పయిపోయింది. తన అధికారాలను ఉపయోగించి సొంత భార్యపైనే కేసులు బనాయించి ఇబ్బందులపాలు చేశాడు. దీంతో ఈ వేధింపులు తట్టుకోలేక సదరు వివాహిత ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఈ పోలీస్ బాస్ లీలలు వెలుగులోకి వచ్చాయి. 

తన భర్త గురించి బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోలీస్ శాఖలో సీఐగా పనిచేస్తున్న రాజయ్య అనే వ్యక్తి తనతో పాటు మరో ముగ్గురిని కూడా పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు తెలిపింది. ఇలా ముగ్గురు భార్యలతో ఒకరికి తెలియకుండా మరొకరితో సంసారం చేస్తూ పిల్లలను కూడా కన్నాడు. అయితే అతడి రాసలీలల  గురించి తెలిసి తాను భర్త రాజయ్య పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని బాధితురాలు ఆవేధన వ్యక్తం చేసింది. 

అంతటితో ఆగకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టించాడని వివాహిత తెలిపారు. అతడి నిత్యపెళ్లికొడుకు విషయాల గురించి బయటపెట్టినందుకు నిత్యం తనను వేధిస్తున్నాడని...వాటిని తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాధితురాలు తెలిపింది. 

ముగ్గురు పిల్లలను వెంటపెట్టుకుని ఓ పెట్రోల్ బాటిల్ రాచకొండ సీపీ ఆఫీస్ కు వివాహిత చేరుకుంది. అక్కడ తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ను పిల్లలతో పాటు తనపై చల్లుకుని సామూహిక ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే అక్కడే వున్న మీడియా ప్రతినిదులు, పోలీసులు  ఆమె ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.