అత్తింటి వేధింపులు పెళ్లైన ఏడాదికే ఓ వివాహితను బలితీసుకున్నాయి. అయితే మరణంలోనూ ఆమె సామాజిక బాధ్యతను మరవలేదు. అందరిలా ఇంట్లోనే ఉండకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటువేసివచ్చి, ఆ తరువాత ఆత్మహత్య చేసుకుంది.

మనసును మెలిపెట్టే ఈ ఘటనలో కేపీహెచ్ బీ సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం. మహబూబ్ నగర్ కు చెందిన భీంశెట్టి సత్యనారాయణ ఈసీఐఎల్ రిటైర్డ్ ఎంప్లాయ్. కేపీహెచ్ బీలో ఉంటున్నారు. ఆయనకు భార్య, కుమార్తె శ్రావణి, కొడుకు కల్యాణ్ ఉన్నారు. పిల్లలిద్దరూ బీటెక్ చదివారు. శ్రావణి ఈసీఐఎల్ లో కొంతకాలం ఉద్యోగం కూడా చేసింది. 

శ్రావణికి మిర్యాలగూడకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రదీప్ తో 2019 నవంబర్ లో వివాహమయింది. కొంతకాలం బాగానే ఉన్నారు. ఆ తరువాత భర్త, అత్తామామలు వేధించడం మొదలెట్టారు. నీకు ఇంకెవరితోనో స్నేహం ఉందంటూ, నడక బాగాలేదంటూ హింసించేవారు. 

ఇదిలా ఉండగా ఈ యేడాది ఫిబ్రవరిలో ప్రదీప్ అమెరికా వెళ్లాడు. అక్కడికి వెళ్లాక కూడా వీడియోకాల్ చేసి మరీ వేధించేవాడు. లాక్ డౌన్ కారణంగా జులైలో శ్రావణి పుట్టింటికి వచ్చింది. ప్రదీప్ తల్లి హైమావతి ఈ నవంబర్ లో కొడుకు దగ్గరికి వెళ్లింది. అక్కడికి వెళ్లాక వేధింపులు మరింత ఎక్కువయ్యాయో ఏమో తెలియదు కానీ.. మంగళవారం పోలింగ్ నేపథ్యంలో శ్రావణి ఉదయమే ఓటేసి ఇంటికొచ్చి బెడ్ రూంలోకి వెళ్లింది. 

తల్లిదండ్రులు శ్రావణి పడుకుందేమో అనుకున్నారు. కొంత సేపటికి టిఫిన్ కోసం తల్లి తలుపు కొట్టగా రెస్పాన్స్ లేదు. దీంతో ఇరుగుపొరుగుతో తలుపులు పగులగొట్టి చూడగా ఉరేసుకొని కనిపించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మామ శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు.