వైరా: మూడు రోజుల క్రితం ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో ఓ బావిలో శవమై తేలింది. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లా వైరా రూరల్ మండల పరిధిలోని పాలడుగు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... పాలడుగు గ్రామానికి చెందిన మాణిగ భాస్కర్ కు శైలజ(27) అనే యువతిని మూడో పెళ్లి చేసుకున్నాడు. ఐదేళ్ల క్రితమే వీరికి వివాహమవగా ఇద్దరు కుమారులు వున్నారు. అయితే దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో నిత్యం ఘర్షణ పడుతుండేవారు. శైలజ తరచూ భర్తతో గొడవపడి పుట్టింటికి వెళుతుండేది. మళ్లీ భర్త వెళ్లి సర్దిచెప్పి తీసుకువస్తుండేవాడు.  

ఇలా ఇటీవల కూడా భార్యాభర్తల మద్య గొడవ జరిగింది. దీంతో శైలజ పిల్లలను ఇంట్లోనే వదిలిపెట్టి బయటకు వెళ్లిపోయింది. అయితే ఆమె ఎప్పటిలాగే పుట్టింటికి వెళ్లి వుంటుందని అందరూ భావించారు. కానీ మూడు రోజులయినా ఆమె అటు పుట్టింటికి ఇటు అత్తారింటికి రాకపోవడంతో ఆఛూకీ కోసం వెతుకులాట మొదలయ్యింది.

ఈ క్రమంలోనే కొందరు రైతులు ఆదివారం పాలడుగు సమీపం నుంచి వెళ్తుండగా బావిలో నుంచి దుర్వాసన వచ్చింది. బావి వద్దకు వెళ్లి గమనించగా శైలజ మృతదేహం కనిపించింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.