దాదాపు ఏడేళ్లపాటు వారు ప్రేమించుకున్నారు. కానీ.. వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో.. ఆ యువతికి మరో వ్యక్తి తో బలవంతంగా పెళ్లి చేశారు. పెద్దలకు ఎదురు చెప్పకుండా తాళి కట్టించుకున్న ఆ యువతి.. కాపురం మాత్రం చేయలేకపోయింది. దీంతో.. ప్రియుడి వద్దకు వచ్చి కలిసి ఎలాగూ బతకలేం.. కనీసం కలిసి చావాలని నిర్ణయం తీసుకుంది. ఇద్దరూ కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన వికారాబాద్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన సార్ల కార్తీక్‌ (21), ఇదే గ్రామానికి చెందిన కటికె రాజారాం కూతురు మీన(21) ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కార్తీక్‌ ఇంటర్‌ వరకు చదివి కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 

మీన 10 వరకు చదివి ఇంటవద్దే ఉంటోంది. ఇరువురి ఇళ్లు పక్కపక్కనే ఉండటంతో ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరి కులాలు వేరు కావడంతో ఇరువురి పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు.

అయినా ఫోన్ల ద్వారా తరచూ మాట్లాడుకునేవారు. ఇది గమనించిన మీన తల్లిదండ్రులు నెల రోజుల క్రితం మహేశ్వరం మండలం గట్టుపల్లికి చెందిన ఓ యువకునికి ఇచ్చి అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేశారు. అయినా మీన.. కార్తీక్‌లు ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. మంగళవారం మీన అత్తవారింటి నుంచి  ఎవరికి చెప్పకుండా వచ్చేసింది. 

అనంతరం కార్తీక్‌ ఆమెను తీసుకొని తన బైక్‌పై నారెగూడకు చేరుకున్నారు. ఎలాగూ కలిసి బతకలేం కాబట్టి కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. నైలాన్‌ తాడుతో నారెగూడ శివారులోని ప్రభుత్వ భూమిలో ఉన్న వేప పెట్టుకు ఉరి వేసుకొని ఆత్యహత్య చేసుకున్నారు. 

బుధవారం ఉదయం 8 గంటలకు పూలపల్లి గ్రామానికి చెందిన హరిజన మల్లయ్య పొలానికి వెళ్తుండగా ఇరువురూ వేలాడుతూకనిపించారు. విషయాన్ని సర్పంచ్‌ నర్సింహ్మరెడ్డికి చేరవేయగా అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్‌ఐ క్రిష్ణ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మృతుడి వద్ద ఉన్న ఆధార్‌ కార్డు ఆధారంగా కార్తిక్‌.. మీనగా గుర్తించి వారి ఇరువురు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

కాగా.. కార్తిక్‌.. మీన ఆత్మహత్యకు ముందు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. మీనకు ఇంతకు ముందు పెళ్లి కావడంతో ఆమె ఒంటిపై ఉన్న పుస్తెల తాడు, గాజులు, మెట్టెలు, 4 సెల్‌ ఫోన్లను తీసి ఒక నల్ల గుడ్డలో కట్టి పక్కన పెట్టారు. కానీ మీన మెడలో మరో తాళి ఉంది. పసుపు కొమ్ముదారంతో పుస్తె ఉండటాన్ని గమనించి వీరు చనిపోవడాకిని ముందు పెళ్లి చేసుకొని ఉంటారని భావిస్తున్నారు.