వారు ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో... ఎదురించి మరీ ఒక్కటయ్యారు. కానీ వారి ప్రేమ ఎక్కువ కాలం నిలవలేదు. ఏడు నెలలకే వారి ప్రేమ కథ విషాదాంతమైంది. యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే...  మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన త్రినయని(20) అనే వివాహిత అత్తారింట్లో బలవన్మరణానికి పాల్పడింది. రాంపల్లిలో నివాసం ఉంటున్న త్రినేయని-అక్షయ్ దంపతులు.. పెద్దలను కాదని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఏడు నెలల క్రితమే వీరి వివాహం జరిగింది. అయితే భర్త వేధింపులు తట్టుకోలేకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.