కట్టుకున్న వాడిపై అనుమానం రోజురోజుకూ మరింత పెరిగి పెనుభూతంగాా మారడంతో ఓ వివాహిత దారుణ నిర్ణయం తీసుకుంది. భర్తతో కలిసుంటున్న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్: భర్తపై అనుమానం ఫెనుభూతంగా మారి తీవ్ర మనస్థాపానికి గురయిన ఓ వివాహిత చివరకు తన ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద సంఘటన తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ వారాసిగూడ ప్రాంతంలో శ్రీకాంత్, సరిత దంపతులు నివాసముండేవారు. శ్రీకాంత్ వాటర్ ఫ్యూరిఫైర్ బిజెనెస్ చేస్తుండగా అతడి భార్య ఇంటివద్దే వుండేది. అయితే బిజెనెస్ వ్యవహారాలకు సంబంధించిన మాటలన్నీ ఎక్కువగా ఫోన్ లోనే జరుగుతుండటంతో శ్రీకాంత్ ప్రతి ఫోన్ కాల్ ను రికార్డ్ చేసి పెట్టుకునేవాడు. ఇదే అతడి సంసారంలో నిప్పులు పోసింది.
తరచూ భర్త ఫోన్ ను తీసుకుని కాల్ రికార్డింగ్స్ వింటూ వుండేది సరిత. అయితే ఇటీవల భర్త ఫోన్ లో కాల్ రికార్డింగ్ విన్న సరితకు ఏదో అనుమానం కలిగింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరిగి తారాస్థాయికి చేరుకున్నాయి.
ఈ క్రమంలో రెండురోజుల క్రితం(శుక్రవారం) భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. అయితే బిజినెస్ పని వుండటంతో భార్యతో గొడవను పక్కనబెట్టి శ్రీకాంత్ బయటకు వెళ్లాడు. ఈ సమయంలో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయని సరిత క్షణికావేశంలో దారుణానికి పాల్పడింది. ఇంటి తలుపులన్నీ మూసేసుకుని ఓ సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
పనులన్నీ ముగించుకుని సాయంత్రం శ్రీకాంత్ ఇంటికి వచ్చి తలుపుతట్టగా ఎంతసేపటికీ భార్య తెరవలేదు. దీంతో అతడు చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా సరిత విగతజీవిగా ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో అతడు కన్నీరుమున్నీరుగా విలపించాడు.
ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దింపారు. అనంతరం అక్కడే పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.మృతురాలి సోదరుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలావుంటే రాజమండ్రి సమీపంలోని అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెంలో ప్రియురాలు మోసం చేసిందని కొప్పిశెట్టి శంకర్ రావు అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో తన వద్ద నుంచి భారీగా డబ్బులు, బంగారం తీసుకున్న ప్రియురాలు ఇప్పుడు మరొక వ్యక్తిని వివాహం చేసుకుంటోందని యువకుడు సెల్పీ వీడియో ద్వారా తెలిపాడు. యువతితో కలిసి ఉన్న ఫొటోలను సదరు యువకుడు వీడియోలో షేర్ చేశాడు. అమ్మాయి చీటింగ్ చేసినందుకే చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియోలో తెలిపాడు.
(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)
