కట్నం కోసం ఆశపడి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులపాటు ప్రేమగా చూసుకున్నట్లు నటించాడు. ఆ తర్వాత మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం కావాలంటూ హింసించాడు. కాగా.. భర్త పెడుతున్న వేధింపులను భరించలేకపోయిన ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విజయవాడ కృష్ణలంక ప్రాంతంలోని గౌతంనగర్‌కు చెందిన పి.నాగరాజు కుమార్తె లక్ష్మీప్రసన్న(27)కు 2019లో రాజమండ్రి ప్రాంతంలోని ధవళేశ్వరానికి చెందిన సాధనాల కార్తీక్‌(29)తో వివాహం జరిపించారు. వివాహసమయంలో 5లక్షల నగదు, 8కాసుల బంగారం, 200 వందల గజాల ప్లాట్‌ కట్నంగా ఇచ్చారు. వీరు జగద్గిరిగుట్ట తులసీ వనం ప్రాంతంలోని నవోదయకాలనీలో నివాసముంటున్నారు. 

ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న కార్తీక్‌ కొంతకాలం భార్యను బాగానే చూసుకున్నాడు. కొంతకాలంగా మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భార్యను నానా రకాల వేధింపులకు గురిచేసేవాడు. కుటుంబ సభ్యులతో కలిసి భార్యను అదనపు కట్నం తీసుకురావాలని వేధించే వాడు. వేధింపులు భరించలేక ఈనెల 28వతేదీ ఉదయం లక్ష్మీప్రసన్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు కేసునమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నారు.