వివాహేతర సంబంధం...వివాహితపై కిరోసిన్ పోసి సజీవదహనం

Married Woman Brutally Murdered
Highlights

వివాహేతర సంబంధానికి మరో వివాహిత బలయ్యింది. ఇద్దరు పిల్లల తల్లి భర్తకు దూరంగా పుట్టింట్లో ఉంటూ...వేరే కులానికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే చివరికి అతడి చేతిలోనే అతి దారుణంగా హత్యకు గురయ్యింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

వివాహేతర సంబంధానికి మరో వివాహిత బలయ్యింది. ఇద్దరు పిల్లల తల్లి భర్తకు దూరంగా పుట్టింట్లో ఉంటూ...వేరే కులానికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే చివరికి అతడి చేతిలోనే అతి దారుణంగా హత్యకు గురయ్యింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

మల్కాజిగిరి ఏసిపి గోనె సందీప్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బోడుప్పల్ సీతారాం కాలనీకి చెందిన మహమూద్ కుమార్తె షాను(30) కి ఇద్దరు సంతానం. భర్తతో తలెత్తిన వివాదం కారణంగా పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు దేవేందర్ నగర్ లో నివాసముండే ఉత్తరప్రదేశ్ వాసి రాకేష్ తో పరిచయం ఏర్పడింది. ఈ  పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.  

అయితే వివాహమై, ఇద్దరు పిల్లలున్న షానును పెళ్లి చేసుకుందామని గత కొన్ని రోజులుగా రాకేష్ కోరుతున్నాడు. అయితే వీరి కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు,కుల పెద్దలు ఒప్పుకోరని తెలిసిన ఆమె అందుకు నిరాకరించింది. దీంతో ఆమెపై రాకేష్ పగ పెంచుకున్నాడు.

గత నెల 28 న ఇంట్లో షాను ఒంటరిగా ఉన్న సమయంలో రాకేష్ మరోసారి పెళ్లి విషయాన్ని ప్రస్తావించాడు. దీనికి మళ్లీ ఆమె నుండి కుదరదనే సమాధానం రావడంతో కోపోద్రిక్తుడైన అతడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. మంటలకు తట్టుకోలేక అరవడంతో చుట్టుపక్కల వారు గమనించారు. మంటలను ఆర్పేసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పూర్తిగా కాలిపోయిన బాధితురాలు మృతిచెందింది.

మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. చివరకు ఉత్తర ప్రదేశ్ గోరఖ్ పూర్ లో తలదాచుకున్నట్లు గుర్తించి స్థానిక పోలీసుల సాయంతో అతడ్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకువచ్చారు.

 

loader