హైదరాబాద్: కట్టుకున్నవాడు చేసిన అప్పులకు భార్య బలయిన దారుణం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. భర్త చేసిన అప్పులు తీర్చమంటూ రాత్రి సమయంలో బలవంతంగా భార్యను ఇంట్లోంచి బయటకు తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారు దుండగులు. అతి కిరాతకంగా ఒంటరిగా వున్న మహిళపై కత్తితో అతి కిరాతకంగా దాడిచేసి హతమార్చి పరారయ్యారు. 

పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్ లోని సైదాబాద్ లోకాయుక్త కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో పరిమళ్ అగర్వాల్‌‌-మంజు దంపతులు పిల్లలతో కలిసి నివాసముండేవారు. అయితే అవసరాల నిమిత్తం భారీగా అప్పులుచేసిన పరిమళ్ వాటిని తీర్చలేక తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో అప్పులవాళ్లు తరచూ ఇంటికి వచ్చి అతడి భార్య మంజుతో గొడవపడేవారు. 

ఇలా సోమవారం రాత్రి కూడా అప్పుల వాళ్లు మంజు ఇంటికి వచ్చి గొడవకు దిగారు. అంతేకాకుండా మాట్లాడుకుందామని చెప్పి ఆమెను బయటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కోపంతో ఊగిపోతూ తనవెంట తెచ్చుకున్న కత్తితో మంజుపై దాడికి దిగాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై మంజు అక్కడికక్కడే మరణించింది. దీంతో దుండగులు అక్కడినుండి పరారయ్యారు. 

మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు సైదాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమారం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్  కు తరలించారు. అనంతరం ఈ మర్డర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన వారు ప్రస్తుతం పరారీలో వున్నట్లు...వారికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.