పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనోవేదనకు ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా వెల్గటూరుకు చెందిన గంట్యాల శ్రీధర్ అనే యువకుడికి రామడుగుకు చెందిన జలతో 2011తో వివాహం జరిగింది.

కొంతకాలంగా దంపతుల మధ్య బేధాభిప్రాయాలు రాగా పలుమార్లు పెద్దల మధ్య పంచాయతీలు జరిగాయి. ఫలితంగా యువకుడు తాగుడుకు బానిసయ్యాడు. కాగా పది రోజుల  క్రితం శ్రీధర్‌ను అతని భార్య జల వదిలేసి పుట్టింటికి వెళ్లింది.

దీంతో నాటి నుంచి మరింతగా కృంగిపోయాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అతని భార్య మరో మహిళను వెంట తీసుకొచ్చి పిల్లలు పుట్టడం లేదని వైద్య పరీక్షలు చేయించుకోవాలని బెదిరింపులకు గురిచేశారు. రెండు రోజుల్లో కరీంనగర్‌ వచ్చి వైద్య పరీక్షలు చేసుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

అప్పటి నుంచి తీవ్రంగా భయపడిన శ్రీధర్... భార్య తరపు వారిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే ఎస్సై సాయంత్రం రావాలని చెప్పడంతో ఇంటికి తిరిగి వచ్చేశాడు. కానీ ఇంతలో తనలో తానే కుమిలిపోయిన శ్రీధర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు  పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు  ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని  తరలించేందుకు ప్రయత్నించారు. అయితే శ్రీధర్ మరణానికి కారణమైన జల, ఆమె బంధువులపై చర్యలు తీసుకునే వరకు శవాన్ని తీసేందుకు అంగీకరించమని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.

ఇదే సమయంలో తన పేరిట ఉన్న ఆస్తుల్లో భార్యకు ఎలాంటి వాటా ఇవ్వొద్దని.. అన్నీ తల్లికే చెందాలని, తన మృతికి జలే కారణమని శ్రీధర్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.