ప్రేమ పేరుతో జల్సాలు, విలాసాలు, విహారాలు చేసి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చే అమ్మాయిలు/ అబ్బాయిలు ఉన్న ఈ రోజుల్లో ప్రేమకోసం మరణం అంచులదాకా వెళ్లి.. చివరికి కన్నవారి మనసులు కరిగించి వివాహబంధంతో ఒక్కటైంది ఓ జంట.

వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా థారూర్ మండలం కుక్కిందకు చెందిన నవాజ్, అత్వెల్లి చెందిన రేష్మాబేగం వరుసకు బంధువులు. రేష్మా సోదరిని నవాజ్ సోదరికి ఇచ్చి పెద్దలు పెళ్లి చేయడంతో... అప్పుడప్పుడు రేష్మ సోదరి ఇంటికి వెళ్లేది. అలా నవాజ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించి, విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అక్కాచెల్లెలిని ఒకే ఇంటికి ఇవ్వడం బాగుండదని భావించిన పెద్దలు వివాహానికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన రేష్మాబేగం ఈ నెల 8న పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.

విషయం తెలుసుకున్న నవాజ్ ఆస్పత్రికి వెళ్లి తన ప్రియురాలిని పరామర్శించాడు. తన కోసం ప్రాణాలు తీసుకోబోయి మంచంపై పడివున్న రేష్మాను చూసి తట్టుకోలేక, ఆమె తాగిన పురుగుల మందును అందరూ చూస్తుండగానే తాగాడు.

వెంటనే స్పందించిన వైద్యులు అతనికి చికిత్సనందించారు. మూడు రోజుల పాటు ఇద్దరికి చికిత్సనందించి ప్రాణాలు కాపాడారు. ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన ఇరు కుటుంబాల పెద్దలు వీరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. గురువారం చక్రాల కుర్చీలపై నవాజ్, రేష్మాలను తీసుకొచ్చి మతపెద్దల సమక్షంలో ఆసుపత్రిలోనే ‘‘నిఖా’’ జరిపించారు.