Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి బహిష్కరణ..

కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని బహిష్కరిచారు. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది.

Marri Shashidhar Reddy expelled from Congress party
Author
First Published Nov 19, 2022, 5:13 PM IST

కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని బహిష్కరించారు. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఆయనను బహిష్కరిస్తున్నట్టుగా తెలిపింది. బీజేపీ నాయకులు బండి సంజయ్, డీకే అరుణలతో కలిసి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మర్రి శశిధర్ రెడ్డి భేటీ కావడం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడంతో ఆయనపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ బహిష్కరణ వేటు వేసినట్టుగా ప్రకటించింది. 

ఆరేళ్ల పాటు మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించినట్టుగా తెలిపింది. ఈ మేరకు టీసీసీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే శశిధర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో.. ఆయన రాజీనామా చేసే కంటే ముందే పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

Marri Shashidhar Reddy expelled from Congress party

ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లిలో అమిత్ షాను కలిసినట్టుగా సమాచారం. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం జరగగా.. తెలంగాణలో రాజకీయ పరిణామాల గురించి మర్రి శశిధర్ రెడ్డితో అమిత్ షా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మర్రి శశిధర్‌ రెడ్డి బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపడాన్ని అమిత్ షా స్వాగతించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే.. మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.  తన మద్దతుదారులను సంప్రదించిన తర్వాత మర్రి శశిధర్ రెడ్డి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరోవైపు మీడియా చిట్‌చాట్‌లో కూడా మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ ఎదుర్కొనే పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని.. అది ఇప్పట్లో నయమయ్యే పరిస్థితి లేదని చెప్పారు. ఇష్టం లేకపోయినా సరే కాంగ్రెస్‌ పార్టీని వీడి బయటకు వస్తున్నానని తెలిపారు. ఇందుకు సంబంధించి బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు ప్రారంభానికి ముందే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.  

ఒక హోంగార్డు పార్టీ నుంచి పోతే పోయేది ఏం లేదని రేవంత్ రెడ్డి టార్గెట్‌గా వ్యంగ్యస్త్రాలు సంధించారు. తనలాగే చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడతారని అన్నారు. తెలంగాణలో చెంచాగాళ్లతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి బాగోలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వొద్దని తాను కూడా చెప్పానని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికను కూడా రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకోలేదని విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios