అధికార పార్టీ సర్పంచ్ లతో పాటు ఇతర ప్రజాప్రతినిధులను బెదిరిస్తూ మావోయిస్టులు విడుదల చేసిన లేఖ జగిత్యాల జిల్లాలో కలకలం రేపుతోంది.
జగిత్యాల : అధికార బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు హెచ్చరిస్తూ మావోయిస్టులు విడుదల చేసిన లేఖలు జగిత్యాల జిల్లాలో కలకలం రేపాయి. బీర్ పూర్ మండలానికి చెందిన ఎంపిపి, కొందరు సర్పంచ్ లు అధికారుల సాయంతో ప్రభుత్వ, అటవీ భూములను కబ్జా చేస్తున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఇలా అక్రమాలకు పాల్పడుతున్న 14మంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ప్రజాకోర్టులో శిక్షిస్తామంటూ గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ కార్యదర్శి మల్లికార్జున్ పేరిట లేఖ విడుదల చేసారు.
ఈ బెదిరింపు లేఖలతో జగిత్యాల పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టాలని... అప్రమత్తంగా వుండాలని ఉన్నతాధికారులు జగిత్యాల పోలీసులను ఆదేశించారు. అలాగే మావోయిస్టుల లేఖకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
ఇక మావోయిస్టుల లేఖపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందిస్తూ భూములు కబ్జా చేసామన్న ఆరోపించడం తగదని అన్నారు. ప్రజా సేవ చేస్తున్న తమపై మావోయిస్టులకు ఎవరో తప్పుడు సమాచారం అందించి వుంటారన్నారు. సర్పంచులుగా ఎన్నికైన నాటినుండి ఇప్పటివరకు సొంత డబ్బులతో గ్రామాలను అభివృద్ది చేసుకున్నామని... ఇలా ఒక్కో సర్పంచ్ 10 లక్షల నుండి 50 లక్షల వరకు నష్టపోయమని అన్నారు. నిజంగానే తాము అవినీతి చేసినట్లు నిరూపిస్తే మావోయిస్టుల లేఖలో పేర్కొన్నట్లు ప్రజాకోర్టులో శిక్షకు సిద్దమన్నారు.
వీడియో
మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖలు అందిన ప్రజాప్రతినిధులు ఇప్పటికే పోలీసులకు పిర్యాదు చేసారు. ఈ బెదిరింపు లేఖలు నిజంగానే మావోయిస్టులే రాసారా... దీని వెనక ఎవరున్నది తేల్చాలని సర్పంచ్ లు డిమాండ్ చేస్తున్నారు.
