'12 మంది అగ్రనేతలకు కోవిడ్': కరోనా చికిత్సకు వచ్చి వరంగల్ పోలీసులకు చిక్కిన మావోయిస్టు
కరోనా చికిత్స కోసం వచ్చిన మావోయిస్టు అగ్రనేతతో పాటు ఆయనతో ఉన్న కొరియర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన మావోయిస్టులను పోలీసులు విచారిస్తున్నారు మావోయిస్టు నేత గడ్డం మధుకర్ తో పాటు ఆయన కొరియర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో మావోయిస్టు అగ్రనేత కీలక విషయాలను వెల్లడించారు.
వరంగల్:
వరంగల్: కరోనా చికిత్స కోసం వచ్చిన మావోయిస్టు అగ్రనేతతో పాటు ఆయనతో ఉన్న కొరియర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన మావోయిస్టులను పోలీసులు విచారిస్తున్నారు మావోయిస్టు నేత గడ్డం మధుకర్ తో పాటు ఆయన కొరియర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో మావోయిస్టు అగ్రనేత కీలక విషయాలను వెల్లడించారు. 12 మంది మావోయిస్టు అగ్రనేతలకు కరోనా సోకిందని మధుకర్ పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ విషయాన్ని వరంగల్ సీపీ తరుణ్ జోషీ తెలిపారు. మావోయిస్టు అగ్రనేతలకు కరోనా సోకిందని ఛత్తీస్ ఘడ్ పోలీసులు కూడ గత మాసంలో ప్రకటించారు. లొంగిపోతే వారికి తాము వైద్యం చేయిస్తామని కూడ పోలీసులు తెలిపారు. ఈ ప్రచారాన్ని మావోయిస్టులు ఖండించారు. పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మావోయిస్టులు తెలిపారు.
అయితే అడవిలోని మావోయిస్టు అగ్రనేతలకు కరోనా సోకిందని గడ్డం మధుకర్ పోలీసులకు తెలిపాడు. ఇటీవలనే ఖమ్మంలో కూడ ఓ మావోయిస్టు చికిత్స తీసుకొని వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో గడ్డం మధుకర్, ఆయన కొరియర్ తమకు చిక్కాడన్నారు. 22 ఏళ్లుగా మధుకర్ మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నాడని వరంగల్ సీపీ తరుణ్ జోషి చెప్పారు. మధుకర్ ది ఆసిఫాబాద్ జిల్లాలోని కొండపల్లి గ్రామమని పోలీసులు తెలిపారు. ఆయనకు కరోనా లక్షణాలు ఉన్నాయన్నారు. కరోనాతో పాటు ఆయన ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నందును ఆసుపత్రిలో చేర్పించామన్నారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.