కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులకు కొదవలేదు. రేవంత్ రెడ్డి మొదలు సీతక్క వరకు చాలా మంది సీఎం క్యాండిడేట్లు ఉన్నారు. కానీ, ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించబోదని మాణిక్‌రావు ఠాక్రే స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే ఈ రోజు ఢిల్లీలో సీఎం అభ్యర్థి గురించి ఓ స్పష్టత ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం క్యాండిడేట్‌ను తాము ప్రకటించబోమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాల ఆధారంగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేస్తామని వివరించారు. 

మాణిక్ రావు ఠాక్రే బుధవారం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో సీఎం అభ్యర్థిపై స్పష్టత ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులకు కొదవ లేదని అన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క, మధుయాష్కి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క వంటి ఎంతో మంది సీఎం అభ్యర్థులు కాంగ్రెస్‌‌కు ఉన్నారని వివరించారు. అయితే, సీఎం క్యాండిడేట్ ఎవరనేది ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించబోదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయ కాంగ్రెస్‌కు లేదని వివరించారు. 

తెలంగాణలో కాంగ్రెస్ అనూహ్య వేగంతో పుంజుకుంటున్నదని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ సమర్థంగా ఎదుర్కోగలదని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: బీజేపీలో మూడు ముక్కలాట? నేనే సీఎం క్యాండిడేట్ అంటూ ఈటల, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం!

అమెరికాలో రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సీఎం అభ్యర్థిగా ఎస్సీ కమ్యూనిటీకి చెందిన భట్టి విక్రమార్క పేరును పరిశీలిస్తున్న కాంగ్రెస్ డిప్యూటీ సీఎంగా ఎస్టీ కమ్యూనిటీకి చెందిన సీతక్కను డిప్యూటీ సీఎం పదవి కోసం పరిశీలించాలని ఓ ఎన్ఆర్ఐ కోరగా.. రేవంత్ రెడ్డి అందుకు సానుకూలంగా స్పందించారు.