మన్ కీ బాత్: హైదరాబాద్ విద్యార్థినిని అభినందించిన ప్రధాని మోదీ.. ఎందుకోసమంటే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా మన్‌కీ బాత్ ఎపిసోడ్‌లో.. హైదరాబాద్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థినిని మోదీ అభినందించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. అయితే తాజా మన్‌కీ బాత్ ఎపిసోడ్‌లో.. హైదరాబాద్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థినిని మోదీ అభినందించారు. బేగంపేటలోని
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన ఆకర్షణ సతీష్.. సొంతంగా ఏడు లైబ్రరీలను స్థాపించడాన్ని మోదీ కొనియాడారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆకర్షణ కృషి చేస్తున్న తీరు అందరిలోనూ స్ఫూర్తి నింపుతోందని అన్నారు. ఇక, ఆకర్షణ సొంతంగా లైబ్రరీలను స్థాపించి.. ఇరుగుపొరుగు వారి నుంచి, సహవిద్యార్థుల నుంచి, తన కుటుంబ సభ్యుల నుంచి పుస్తకాలు సేకరించడం ప్రారంభించింది.
ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ.. మన దేశంలో విద్యను ఎప్పుడూ సేవగానే చూస్తామని అన్నారు. అదే స్ఫూర్తితో పిల్లల చదువు కోసం కృషి చేస్తున్న ఉత్తరాఖండ్‌లోని కొంతమంది యువత గురించి నాకు తెలిసిందని.. నైనిటాల్ జిల్లాలో కొంతమంది యువకులు పిల్లల కోసం ప్రత్యేకమైన ‘ఘోడా లైబ్రరీ’ని ప్రారంభించారని చెప్పారు. నేటి యుగం డిజిటల్ టెక్నాలజీ, ఇ-బుక్స్‌తో కూడుకున్న మాట నిజమే అయినప్పటికీ.. ఇప్పటికీ పుస్తకాలు మన జీవితంలో మంచి స్నేహితుని పాత్రను పోషిస్తాయని అన్నారు. అందుకే పిల్లలను పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలని కోరారు.
‘‘హైదరాబాద్‌లో లైబ్రరీలకు సంబంధించి ఇలాంటి అపురూపమైన కృషిని నేను తెలుసుకున్నాను. ఇక్కడ ఏడో తరగతి చదువుతున్న ఆకర్షణ సతీష్ అపురూపమైన విజయాలు సాధించింది. 11 ఏళ్ల వయస్సులో ఆమె పిల్లల కోసం ఒకటి, రెండు కాదు- ఏడు లైబ్రరీలను నిర్వహిస్తోందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. రెండేళ్ల క్రితం తల్లిదండ్రులతో కలిసి క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లిన సందర్భంలో ఈ దిశగా ఆకర్షణకు ప్రేరణ లభించింది. అక్కడి పిల్లలు వారిని కలరింగ్ బుక్స్ అడిగారు.
ఈ విషయం చిన్నారి ఆకర్షణ మనస్సును తాకింది. దీంతో వివిధ రకాల పుస్తకాలను సేకరించాలని ఆమె నిర్ణయించుకుంది. తన ఇరుగుపొరుగు ఇళ్ళు, బంధువులు, స్నేహితుల నుండి పుస్తకాలు సేకరించడం ప్రారంభించింది. అదే క్యాన్సర్ ఆసుపత్రిలో పిల్లల కోసం మొదటి లైబ్రరీ ప్రారంభించింది. పేద పిల్లల కోసం ఇప్పటివరకు ప్రారంభించిన ఏడు లైబ్రరీలలో ఇప్పుడు సుమారు 6 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఈ చిన్న 'ఆకర్షణ' విశేషంగా కృషి చేస్తున్న తీరు అందరిలోనూ స్ఫూర్తి నింపుతోంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.