తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా నూతనంగా నియమితులైన మాణిక్ రావ్ ఠాక్రే ఈ నెల 11న రాష్ట్రానికి రానున్నారు. ఆయన రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. 

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా నూతనంగా నియమితులైన మాణిక్ రావ్ ఠాక్రే ఈ నెల 11న రాష్ట్రానికి రానున్నారు. ఆయన రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఈ నెల 12న గాంధీ భవన్‌లో జరిగే టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో మాణిక్ రావ్ ఠాక్రే పాల్గొననున్నారు. టీ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా బాధ్యతలను చేపట్టిన తర్వాత మాణిక్ రావ్ ఠాక్రే హైదరాబాద్‌కు రానుండటం ఇదే తొలిసారి. ఇక, టీ కాంగ్రెస్ ఇంచార్జ్ మార్పు జరిగిన నేపథ్యంలో.. 12వ తేదీన జరిగే టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో టీ కాంగ్రెస్ సీనియర్లు హాజరవుతారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరి సీనియర్లు ఎలాంటి వైఖరి అనుసరిస్తారో వేచి చూడాలి. 

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీల నియమాకం చిచ్చును రాజేసిన సంగతి తెలిసిందే. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లు గళం వినిపించారు. ఒర్జినల్ కాంగ్రెస్ నినాదం ఎత్తుకున్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన కాంగ్రెస్ హైకమాండ్.. తమ దూతగా సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దింపింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో పర్యటించిన దిగ్విజయ్ సింగ్ పార్టీ నేతలతో మాట్లాడారు. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితి సద్దుమణిగినట్టుగా కనిపించకలేదు. 

ఇటీవల నిర్వహించిన టీపీసీసీ శిక్షణ తరగతులకు సీనియర్ నేతలు డమ్మా కొట్టారు. ఉత్తమ్, జగ్గారెడ్డి, మధుయాష్కి, దామోదర్ రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డి, శ్రీధర్ బాబు హాజరుకాలేదు. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌రావు థాకరేను ఏఐసీసీ అధిష్టానం నియమించింది. అయితే మాణిక్కం ఠాగూరుపై సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే కొత్త ఇంచార్జ్ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. సీనియర్లు తమ అసమ్మతిని వీడాతారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.