తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను గద్దెదించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశించారు.
న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను గద్దెదించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశించారు. ఈ సమావేశం అనంతరం నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. ఎన్నికల టార్గెట్‌గానే సమావేశం జరిగిందని స్పష్టం చేశారు. తెలంగాణలో పరిస్థితులపై ఫోకస్ చేయాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఏఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది చర్చించడం జరిగిందని చెప్పారు.
ఎన్నికలకు సిద్దం కావాలని రాహుల్ గాంధీ ఆదేశించారని తెలిపారు. విభేదాలు వీడి ఎకతాటిపైకి వచ్చి పనిచేయాలని సూచించారని చెప్పారు. సమావేశంలో ప్రతి నేతతో మాట్లాడారని.. సలహాలు స్వీకరించడంతో పాటు సూచనలు చేశారని తెలిపారు. తెలంగాణ ఒక్క కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరుకు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలు ఆశించిన విధంగా జరగడం లేదని అన్నారు. ప్రజల సొమ్మంతా ఒక పార్టీ ప్రచార ఖర్చుకే సరిపోతుందని విమర్శించారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్‌ను గద్దె దించి.. కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌తో కాంగ్రెస్‌కు ఎప్పుడూ ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 120 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించామని తెలిపారు. కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా ఏ అంశాలను తీసుకుని ముందుకు వెళ్లాలనేదానిపై చర్చించామని చెప్పారు. తెలంగాణ ఎన్నికల కార్యచరణను కాంగ్రెస్ ప్రారంభించిందని అన్నారు. కర్ణాటకలో ఏ ఫార్ములాతో కాంగ్రెస్ విజయం సాధించిందో.. అలాంటి పదునైన కార్యచరణతో ముందుకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. అక్కడ పాటించిన కొన్ని మౌలిక సూత్రాలను తెలంగాణలో పార్టీలో అమలు చేయాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడా భారీ విజయం సాధించి.. ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పారు.
Also Read: సమావేశ వివరాలు బయటకు చెప్పొద్దు.. స్ట్రాటజీ మీట్‌లో కీలక ఆదేశాలు.. జగ్గారెడ్డి ఏమన్నారంటే..?
ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2023 డిసెంబర్‌లో జరగనున్న ఎన్నికలకు ఇది ఒక సన్నాహక సమావేశం అని అన్నారు. అందరి నాయకుల సలహాలు, సూచనలు తీసుకొవడం జరిగిందని చెప్పారు. అందరం ఐకమత్యంతో ముందుకు సాగాలని, బీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, టికెట్ల వివరాలు తొందరగా పూర్తి చేసుకోవాలని, ఆర్గనైజేషన్ గ్యాప్‌లను త్వరగా పూర్తిచేసుకోవాలని.. చర్చించడం జరిగిందన్నారు. కర్ణాటక తరహా వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు.
మాజీ ఎంపీ మదుయాష్కీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌తో తమకు ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని చెప్పారు. కాంగ్రెస్‌పై బీజేపీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎవరితో కలిసి ముందుకు వెళ్తారనేది కూడా ఆలోచించుకోవాలని అన్నారు.
