దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం జరిగింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రెండున్నర గంటలకు పైగా సమావేశం సాగింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం జరిగింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో రెండున్నర గంటలకు పైగా సమావేశం సాగింది. ఈ సమావేశంలో.. మాణిక్ రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, జానారెడ్డి, సంపత్ కుమార్, షబ్బర్ అలీ, జగ్గారెడ్డి, వీహెచ్, సీతక్క, శ్రీధర్ బాబు, రేణుకా చౌదరి.. తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం రాష్ట్ర నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో తీసుకున్న వివరాలు బయట చెప్పొద్దని జారీ చేసినట్టుగా సమాచారం. అలాగే నాయకుల మధ్య సమన్వయంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బయటకు వచ్చిన నేతలు.. మీడియాతో సమావేశ వివరాలు బయటకు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. అయితే ఎన్నికల సంసిద్దతపై చర్చ జరిగిందని చెబుతున్నారు. సమావేశం సజావుగా సాగిందని.. అందరి నాయకుల అభిప్రాయాలను, సూచనలను ఖర్గే, రాహుల్ గాంధీ విన్నారని ఎమ్మెల్యే సీతక్క చెప్పారు.
మరో నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మీడియా అనేక విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తుందని.. కానీ తాను ఏం మాట్లాడలేనని అన్నారు. ఎన్నికలకు సంబంధించి అంశాలపై చర్చించడం జరిగిందని చెప్పారు. లోపల ఎం జరిగిందనేది తాను చెప్పలేనని అన్నారు. బయట ఏం మాట్లాడకూడదని చెప్పారని తెలిపారు.
