ఎన్నికలకు ముందు చేరికలతో టీ కాంగ్రెస్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది. కానీ మరోవైపు నియోజకవర్గాల్లో నేతలు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరిపై పోరాడామో వారితో కలిసి పనిచేయడం తమ వల్ల కాదని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చేరికలను అడ్డుకుంటే చర్యలు తప్పవని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్ హెచ్చరించారు.
టీపీసీసీ (tpcc) కార్యవర్గ సమావేశంలో పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ (manickam tagore) . రాహుల్ గాంధీ (rahul gandhi) ఆదేశాలతోనే పార్టీలో చేరికలు జరుగుతున్నట్లు తెలిపారు. చేరికలను ఎవ్వరూ అడ్డుకోవద్దని.. పార్టీలో ఇంకా ఒకరిద్దదరు అంతర్గత విషయాలపై మాట్లాడుతున్నారని ఠాగూర్ మండిపడ్డారు. ఇకపై ఎవరైనా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఐదేళ్లు పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రమోషన్ ఇస్తామని ఠాగూర్ తెలిపారు. పార్టీలో చేరిన ఎవ్వరికి కూడా టికెట్లకు సంబంధించిన హామీ లేదని ఆయన నేతలకు వివరించారు. అలాగే ఆగస్టు మొదటి వారంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు సంబంధించిన అంశాలపైనా ఠాగూర్ క్లారిటీ ఇచ్చారు.
అంతకుముందు మాణిక్యం ఠాగూర్ అధ్యక్షతన గాంధీ భవన్ లో పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. అయితే దీనికి సీనియర్ నేతలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి చర్చికలపై చర్చ జరిగింది. టీ. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. పార్టీలో చేరికలపై ఇటీవలి కాలంలో నేతల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. గీత దాటిన నేతలను లైన్‌లో పెట్టేందుకు అధిష్టానం సిద్ధమైంది. దీనిలో భాగంగా ముఖ్య నేతలతో ఠాగూర్ సమావేశమయ్యారు.
ALso Read:టీ.కాంగ్రెస్ లో చేరికల పంచాయతీ.. పీసీసీ సమావేశానికి నలుగురు అగ్రనేతల డుమ్మా , ఠాగూర్ సీరియస్
కాగా.. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో (telangana congress) జోష్ కనిపిస్తోంది. చేరికలు కొనసాగుతూ వుండటంతో హస్తం పార్టీ (congress) కొత్త ఉత్సాహంతో వుంది. అయితే చేరికలపై కొందరు నాయకులు అసంతృప్తిగా వుండటంతో కొత్త పంచాయతీలు తెరపైకి వస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ (trs) నుంచి వచ్చే నేతలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చేందుకు హస్తం పార్టీ సముఖత వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఓదేలు ఆయన సతీమణితో పాటు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఇటీవలే పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి (vijaya reddy), అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
ఇదిలావుంటే ఖమ్మం జిల్లా నేతలు కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీ శ్రేణుల్లో కొంత అసంతృప్తికి కారణమైంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఎలాంటి సమాచారం లేకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై అశ్వారావుపేట కాంగ్రెస్ నేతలు భట్టికి ఫిర్యాదు చేశారు. ఇక తుంగతుర్తి నియోజకవర్గం నుంచి డాక్టర్ రవి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై తుంగతుర్తి ఇన్‌ఛార్జి అద్దంకి దయాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkatreddy) సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన డాక్టర్ రవి.. పీసీసీ చీఫ్ రేవంత్‌ను (revanth reddy) కలిసేందుకు వెళ్లగా ఆయన భేటీకి నిరాకరించారు.
ఇకపోతే.. మొన్న కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ (erra sekhar) వచ్చారు. రేవంత్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఎర్ర శేఖర్ చేరికను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నేర చరిత్ర కలిగిన ఎర్ర శేఖర్ ను పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. గాంధీ సిద్ధాంతాలను నమ్మే కాంగ్రెస్ లోకి నేరగాళ్లు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్ర శేఖర్ చేరికపై అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో వున్నారు కోమటిరెడ్డి. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి గీతా రెడ్డి కూడా చేరికను సమర్ధించారు.
