మంచిర్యాలలో విషాదం.. మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య..వేధింపులే కారణమా?
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య బలవన్మరణానికి పాల్పడడంతో మంచిర్యాలలో కలకలం రేగింది. ఆమె మరణానికి అతని వేధింపులే కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
మంచిర్యాల : మంచిర్యాలలో ఓ మహిళ ఆత్మహత్య కలకలం రేపింది. ఆమె మున్సిపల్ కమిషనర్ భార్య కావడమే దీనికి కారణం. మంగళవారం మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి (32) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జ్యోతి ఆత్మహత్యకు కారణం భర్త బాలకృష్ణ, అతని కుటుంబ సభ్యుల వేధింపులేనని జ్యోతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జ్యోతి తన తల్లిదండ్రులైన గంగవరపు రవీంద్ర కుమారి, రాంబాబులకు మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఫోన్ చేసింది. తన భర్త తనను చంపేసేలా ఉన్నాడని ఏడుస్తూ చెప్పినట్లు వారు చెబుతున్నారు.
భర్త మున్సిపల్ కమిషనర్ గా ఎన్నికైన తర్వాత నుంచి తనపై వేధింపులు ఎక్కువ చేశాడని.. కుటుంబ సభ్యులు అతనికి తోడయ్యారని తెలిపారు. అంతేకాదు.. తాను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కోట్లలో కట్నం వచ్చేదని, అందమైన భార్య దొరికేదని పదేపదే మాటలతో హింసించేవాడని తెలిపారు. బయటికి చూడడానికి చాలా మంచివాడిగా కనిపించే బాలకృష్ణ ఇంట్లో సైకోలాగా శాడిస్టులాగా ప్రవర్తించేవాడని తెలిపారు. మంచిర్యాల సీఐ నారాయణ నాయక్ ఈ మేరకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు.
హైదరాబాద్ : నడిరోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణహత్య
అయితే తల్లిదండ్రులు మాత్రం తాము బాలకృష్ణ మీద ఫిర్యాదు చేయబోమని, ముందు అతనిని తమకు అప్పగించాలని గొడవకు దిగారు. దీంతో బాలకృష్ణ మీద కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని సీఐ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అప్పుడు కాని జ్యోతి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు జ్యోతితో పాటు బాలకృష్ణ సెల్ ఫోన్లను సీజ్ చేశారు. వారి ఇంటి చుట్టుపక్కల వారిని, ఇంటి పనిమనిషిని విచారించి పలు విషయాలు తెలుసుకున్నారు.
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ గా ఉన్న బాలకృష్ణ స్వగ్రామం, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం. ఆయన భార్య జ్యోతి స్వస్థలం కొనిజర్ల మండలం సీతారామపురం. 2014, ఆగస్టు 14న వీరికి వివాహమయ్యింది. బాలకృష్ణ పెళ్లైన సమయంలో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేశాడు. కానిస్టేబుల్ గా హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న సమయంలో 2020లో గ్రూప్ టూ ద్వారా మున్సిపల్ కమిషనర్ గా ఎంపిక అయ్యాడు. నిర్మల్ లో మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తూ.. ఏడాదిన్నర క్రితం మంచిర్యాలకు బదిలీ అయ్యాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరూ మంగళవారం స్కూలుకు వెళ్లిన తర్వాత జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్కూల్ నుంచి వచ్చేసరికి తల్లి చనిపోయి ఉండడంతో వారు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు.