కరోనా కల్లోలం సృష్టిస్తోంది. జీవితాల్ని అతలాకుతలం చేస్తోంది. కుటుంబాలకు కుటుంబాలనే తుడిచి పెట్టేస్తోంది. ఎంతో మందిని అనాథలుగా చేస్తోంది. ఆస్పత్రుల బిల్లులు కట్టలేక బికారులుగా మార్చేస్తోంది.

తాజాగా మంచిర్యాల మండలంలోని తాళ్ల పేటలో ఓ కుటుంబాన్ని కరోనా చిదిమేసింది. 15 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురిని బలితీసుకుంది. భర్త మృతి విషయం భార్యకు తెలియదు. భార్య మరణం విషయం భర్తకు తెలియదు. వీరిద్దరి మరణం కుమారుడికి తెలియదు.  కుమారుడు లేడనే విషయం తల్లిదండ్రులకు తెలియదు. ఒకరి మరణవార్త మరొకరు తెలియకుండా అందరూ చనిపోయారు.

ఇంతకంటే దారుణం.. విషాదం మరొకటి ఉండదేమో.. వింటుంటేనే భయాందోళనలు కలిగే ఈ ఘటన మంచిర్యాలలో జరిగింది. వివరాల్లోకి వెడితే...తాళ్లపేట గ్రామానికి చెందిన రిటైర్డ్  కార్మికుడు అక్కనపెల్లి కుమారస్వామి(70), ఆయన భార్య భూలక్ష్మీ(65), కుమారుడు రఘు(28) గత 15 రోజుల క్రితం కరోనా బారినపడ్డారు.

దీంతో తండ్రికొడుకులు కరీంనగర్ ఆస్పత్రిలో చేరారు. తల్లి తాళ్లపేటలోనే హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటుంది. ఆస్పత్రిలో చేరిన మూడు రోజులకే రఘు ఈనెల 9న మృతిచెందాడు.

ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదు. అతను మృతి చెందిన మరుసటిరోజే హోం ఐసోలేషన్‌లో ఉన్న తల్లి భూలక్ష్మి ఈ నెల 10న మృతి చెందింది. వీరిద్దరూ మృతి చెందిన విషయం కుమారస్వామికి తెలియదు.

అతడు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఇలా ఒకే కుటుంబం లో కరోనా బారిన పడటం, ముగ్గురు 15 రోజుల్లో మృత్యువాత పడటం తాళ్ల పేటలో తీవ్ర విషాదాన్ని నింపింది.