హిట్ అండ్ రన్.. ప్రమాద హెచ్చరిక బోర్డును సరిచేస్తుంటే గుద్దిన కారు.. వ్యక్తి మృతి...
వాహనాదారులను హెచ్చరిద్దామని ప్రయత్నించి తాను చనిపోయాడు ఓ వ్యక్తి. వార్నింగ్ సైన్ బోర్డును సరిచేస్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు గుద్దడంతో మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో జరిగింది.
హైదరాబాదు : మలక్‌పేట్-సంతోష్‌నగర్ రోడ్డులో విద్యుత్ శాఖ గుంత తవ్వింది. వర్షం కారణంగా ప్రమాదం జరగకుండా పోలీసులు బారికేడ్‌లు, సైన్‌బోర్డ్ ఏర్పాటు చేశారు. ఆ సైన్ బోర్డ్ పడిపోయింది. దీంతో లియాఖత్ అలీ ఖాన్ అనే వ్యక్తి హెచ్చరిక బోర్డును సరిగా పెట్టేందుకు రోడ్డు మధ్యలోకి వెళ్లాడు. బోర్డును సరి చేస్తున్నాడు. ఇంతలో వేగంగా వచ్చిన కారు అతడిని గుద్దేసి వెళ్లిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.
వివరాల్లోకి వెడితే.. హైదరాబాదులో రద్దీగా ఉండే వీధి మధ్యలో విద్యుత్ శాఖ రిపేర్ పనులకోసం గుంత తవ్వింది. ఇంతలో వర్షాలు మొదలయ్యాయి. దీంతో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గాలులకు సైన్ బోర్డ్ పడిపోయింది. దీన్ని సరిచేసి వాహనదారులకు ఇబ్బందితొలగించాలని ప్రయత్నించాడు లియాఖల్ అలీ.. హెచ్చరిక బోర్డును అమర్చడానికి ప్రయత్నిస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. మలక్‌పేటలోని సోహైల్ హోటల్ సమీపంలో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. హోటల్ ఉద్యోగి లియాఖత్ అలీ ఖాన్ అలియాస్ జాహెద్, హెచ్చరిక బోర్డు కింద పడిపోవడంతో సరిగా పెట్టడానికి రోడ్డు మధ్యకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.
జాహెద్ సోదరుడి ఫిర్యాదు మేరకు చాదర్‌ఘాట్ పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 304 ఎ కింద దీన్ని యాక్సిడెంట్ కింద కాకుండా హత్య కేసుగా నమోదు చేశారు. హిట్ అండ్ రన్ కేసులో కారు డ్రైవర్‌ను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ పోలిశెట్టి సతీష్ తెలిపారు. జాహెద్ దబీర్‌పురాలోని ఘౌసియా మసీదు ప్రాంతంలో నివాసం ఉండేవాడు. జాహెద్ సైన్‌బోర్డ్‌ను తిరిగి సరిగ్గా పెట్టడానికి వెళ్లినప్పుడు వేగంగా వచ్చిన కారు అతనిని ఢీకొట్టడం.. రెప్పపాటులో కారు అదృశ్యమవ్వడం అక్కడి సీసీ టీవీల్లో నమోదయ్యాయి.. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ (టిఎస్‌ఎస్‌పిడిసిఎల్) గుంత తవ్విందని, అడపాదడపా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు బారికేడ్‌లు,సైన్‌బోర్డ్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. అప్పటికే పోలీసులు బారికేడ్‌లు వేయగా, గుంతపై వేసిన స్లాబ్‌ను నీరు వెళ్లేందుకు తీసినట్లు తెలిపారు. ‘‘రెండు మూడు రోజుల క్రితం విద్యుత్ శాఖ వారు తవ్విన 1 చదరపు అడుగుల వెడల్పు గల గుంత. లోపల విద్యుత్తు తీగలు మరియు దానిపై స్లాబ్ ఉన్నాయి. వర్షం కురుస్తున్నందున, నీరు లోపలికి వెళ్లడానికి స్లాబ్ కొద్దిగా కదిలింది, ”అని ఇన్‌స్పెక్టర్ చెప్పారు, మలక్‌పేట్-సంతోష్‌నగర్ రోడ్ కాస్త డల్ లైటింగ్‌తో రద్దీగా ఉండే రహదారి అని చెప్పారు.
యాక్సిడెంట్ గమనించిన వెంటనే స్తానికులు జాహెద్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ జాహెద్ మృతి చెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఓల్డ్ సిటీకి చెందిన మజ్లిస్ బచావో తెహ్రీక్ (MBT) కార్యకర్త, నాయకుడు అమ్జెద్ ఉల్లా ఖాన్ మాట్లాడుతూ, జాహెద్ ప్రజలను రక్షించడానికి, రహదారి మధ్యలో ఉన్న గుంత కారణంగా ఏదైనా ప్రమాదాలను నివారించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డ్, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ను ఖాన్ తప్పుపట్టారు.
సోహైల్ హోటల్ నుంచి హఫీజ్ బాబానగర్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేసి రెండున్నరేళ్లు కావస్తోంది. GHMC, HMWSSB, TSSPDCL ద్వారా మూడు వేర్వేరు పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. కానీ ఎటువంటి భద్రతా చర్యలు లేవు, ”అని ఖాన్ అన్నారు. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, మృతుల కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి ప్రభుత్వ గృహం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, నిర్లక్ష్యానికి పాల్పడిన పౌర అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధ్యులను అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.