అతనికి అప్పటికే పెళ్లయ్యింది. భార్య చెల్లినే రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతా సజావుగా సాగిపోతుందనుకున్న సమయంలో సదరు వ్యక్తి అనుకోని కారణాల వల్ల రెండో భార్యకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. అయితే.. దానిని ఆమె అవకాశంగా తీసుకోని కారు డ్రైవర్ తో లేచిపోయింది. దీంతో.. తన భార్యతో ప్రేమాయణం నడుపాడనే కోపంతో ఆ డ్రైవర్ పై దాడి చేశాడు. దీంతో.. అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన ఇనుగాల విజయ్‌కి ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరిద్దరూ అక్కాచెల్లెళ్లు. రెండో భార్య కరీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంట పట్టణ ప్లానింగ్‌ అధికారి. కాగా కొంత కాలం క్రితం విజయ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నాడు. అయితే.. ఈ ఎన్నికల్లో  పోటీకి దిగాలంటే ఇద్దరు భార్యలు ఉండరాదన్న నిబంధనతో.. రెండో భార్యకు విజయ్‌ విడాకులిచ్చారు.  ఆ తర్వాత ఆమె, కారు డ్రైవర్‌ ఇనుగాల తిరుపతిని ప్రేమించి గుడిలో దండలు మార్చుకున్నారు. దీంతో తన భార్యను తిరుపతి అపహరించాడని కేసు పెట్టారు. తిరుపతిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

మరోవైపు విజయ్‌, అతడి రెండో భార్య మళ్లీ కలిసిపోయారు. కొన్నాళ్లకు బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన తిరుపతి, పని కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాడు. మూడు రోజుల క్రితం స్వగ్రామానికి రాగా.. విజయ్‌ తన రెండో భార్యతో కలిసి అతడి హత్యకు కుట్ర పన్నాడు. మరికొందరు తన బంధువులతో కలిసి తిరుపతి పై కత్తులతో దాడి చేశాడు. ఈ దాడిలో తిరుపతికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.