లోన్ యాప్ వేధింపులు.. ఉద్యోగం లేదని తండ్రి మందలింపు.. కొడుకు ఆత్మహత్య..
లోన్ యాప్ వేధింపులతో విసుగెత్తిన ఓ యువకుడు తల్లిదండ్రులకు లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ జవహర్ నగర్ లో కలకలం రేపింది.
హైదరాబాద్ : మమ్మీ, డాడీ నన్ను క్షమించండి. మీరు కరెక్టుగా ఉన్నారు. నేను కరెక్టుగా లేను.. నేనేమీ చేయలేను.. నేను మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నా.. అమ్మా, నన్ను క్షమించు మీరు నా ప్రాణం.. మీకు అందనంత దూరం వెళ్లిపోతున్నా అంటూ Loan apps ద్వారా రుణం తీసుకున్న ఓ యువకుడు suicide note రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విధారక సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.
జవహర్ నగర్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఖాధర్ కుటుంబ సభ్యులతో కలిసి చెన్నాపురంలోని సాయి గణేష్ కాలనీలో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఖాజా మెహినుద్దీన్ (23) ఉన్నారు. ఇద్దరు కుమార్తెల వివాహం జరిగింది. మదర్సాలో చదువుతున్న ఖాజా ఇంట్లో ఆన్ లైన్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఖాజా ఫోన్ తో పాటు ఇంట్లో ఉన్న తండ్రికి ఫోన్ ద్వారా లోన్ యాప్ నుంచి రూ. లక్ష లోన్ తీసుకున్నాడు.
అసలు వడ్డీ లోన్ కు సంబంధించి రూ.40వేలు కట్టాలని లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. దీంతో తండ్రి కొంత డబ్బును కట్టాడు. ఈ నెల 8న ఖాజాను తండ్రి మందలించాడు. జీతం వస్తుంది కడతానని చెప్పాడు. అదే రోజు ఖాజా తల్లిదండ్రులు సోదరి ఒక గదిలో నిద్రిస్తుండగా వంటగదిలోకి వెళ్లిన ఖాజా మొహినుద్దీన్ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఏపీలోని నెల్లూరులో తాను వివాహం చేసుకున్న యువతికి ఆమె తల్లిదండ్రులు మరొకరితో పెళ్లి చేశారనే విషయాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు అనంతపురంలోని గౌరీ థియేటర్ సమీపంలో నివసిస్తున్న బాలకృష్ణ సింగ్ రాడ్ బెండింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తిరుమలకు వెళ్లిన ఆయనకు కలువాయి మండలానికి చెందిన ఓ యువతితో పరిచయమై అది ప్రేమగా మారింది.
ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెను కావలిలోని తమ బంధువుల ఇంట్లో ఉంచి వివాహానికి ప్రయత్నాలు చేశారు. దీంతో గతేడాది మేలో బాలకృష్ణ సింగ్, యువతి పారిపోయి వివాహం చేసుకుని అనంతపురంలో కాపురం పెట్టారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన కావలి పోలీసులు అనంతపురంలో ఉన్న వీరిని తీసుకువచ్చారు.
యువతి తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పదిరోజుల్లో వివాహం చేస్తామని తమ కుమార్తెను వెంట తీసుకు వెళ్లారు. అప్పటి నుంచి ఆమె జాడ తెలియరాలేదు. తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో బాలకృష్ణ సింగ్ పెట్టడంతో యువతి కుటుంబ సభ్యులు దిశ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణకు గాను ఈ నెల 6న ఆయన హాజరయ్యారు. అతని మొబైల్ ఫోన్ లోని ఫోటోలను పోలీసులు డిలీట్ చేయించి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మరుసటిరోజు కౌన్సెలింగ్ చేశారు.
ఈ క్రమంలో తన కుమార్తె వివాహం చేశామని, ఆమె జోలికి రావద్దని తల్లిదండ్రులు సూచించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఫోన్ కోసం దిశ పోలీస్ స్టేషన్ కు బుధవారం బయలుదేరిన బాలకృష్ణ సింగ్.. సమీపంలోని చెట్ల వద్ద తలకు రాసుకునే ఆయిల్ ను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం జిజిహెచ్ లో చేర్పించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు కేసును బుధవారం అర్ధరాత్రి నమోదు చేశారు.