టీ తాగడానికి వచ్చాడు. తాగాడు.. తాగిన దానికి డబ్బులు ఇవ్వమని అడిగినందుకు అతనికి కోపం వచ్చింది. వెంటనే  ఆ టీకొట్టుపై పెట్రోల్ పోసి తగలపెట్టాడు. ఈ దారుణ సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా..  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎన్టీఆర్ నగర్ లోని చింతచెట్ల బస్టాప్ వద్ద స్థానికురాలైన గుండమ్మ(65) టీ కొట్టు నడుపుతోంది. అక్కడే నివసించే షబ్బీర్(40) సరూర్ నగర్ లో బైక్ మెకానిక్. ద్విచక్రవాహనాలకు చక్కగా  మరమ్మతు చేస్తాడన్న పేరున్న షబ్బీర్ మద్యానికి బానిసయ్యాడు. తరచూ గుండమ్మ నడిపే టీకొట్టులో చాయ్ తాగుతూ ఖాతా పెట్టేవాడు.

అతను కట్టాల్సిన బిల్లు పెరగడంతో పది రోజుల క్రితం గుండమ్మ అతనిని నిలదీసింది. అయితే.. డబ్బు కట్టకపోతే చాయ్ ఇవ్వను పొమ్మంది. ఇజ్జత్ పోయిందని భావించిన షబ్బీర్ కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 25న రాత్రి 2గంటల సమయంలో తాగిన మత్తులో బైక్ పై వస్తున్న షబ్బీర్ కు గుండమ్మ టీ కొట్టు కనిపించింది. చుట్టూ ఎవరూ లేకపోవడంతో.. తాను నడుపుతున్న బైక్ లో నుంచి పెట్రోల్ తీసి టీ కొట్టుపై చల్లించి నిప్పు పెట్టాడు.

మంటలు గమనించిన పక్క భవనంలోని వాచ్ మెన్ గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. అయితే.. టీ కొట్టు పూర్తిగా కాలిబూడిదయ్యింది. జీవనాధారం పోయిందని గుండమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. సీసీ కెమేరా ఆధారంగా నిందితుడిని షబ్బీర్ గా పోలీసులు గుర్తించారు.