గల్ఫ్‌లో ఏదో ఒక పనికి కుదిరి నాలుగు డబ్బులు సంపాదించుకుందామనుకున్న మహిళకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పెకేర్ గ్రామానికి చెందిన కోలి వెంకట నర్సింహమూర్తి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు.

దాంతో పాటు దుబాయ్, మస్కట్ ప్రాంతాలకు నిరుద్యోగులను పంపించే ఏజెంట్‌గా ఆ ప్రాంతంలో ప్రచారం చేసుకున్నాడు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఓ మహిళ తన కుటుంబ ఆర్ధిక పరిస్థితులు బాగాలేవని.. తనను మస్కట్ పంపించాల్సిందిగా మూర్తిగా సంప్రదించింది.

దీంతో ఈ నెల 18వ తేదీన ఆమెతో పాటు మరో మహిళను తీసుకుని చెన్నై వెళ్ళాడు. అక్కడ వారితో పాటు వచ్చిన మహిళకు విమాన టికెట్ దొరకలేదని పంపించేశాడు. అనంతరం సదరు మహిళతో కలిసి ఓ లాడ్జీలో దిగి.. రెండు రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం ఆమెను ఇమ్మిగ్రేషన్‌కు తీసుకెళ్లి సరైన పత్రాలు లేకపోవడంతో మస్కట్‌కు వెళ్లడం కుదరడం లేదని.. నగరానికి వచ్చి మరోసారి ప్రయత్నిద్దామని నమ్మించి.. 22న రైలులో సికింద్రాబాద్ తీసుకొచ్చాడు.

మరోసారి మూర్తి అత్యాచారానికి ప్రయత్నించగా.. ఆమె తప్పించుకుని బాత్‌రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. అనంతరం లాడ్జీ సిబ్బంది సహకారంతో 23న పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి తీసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి.. నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.