విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని అబద్ధం ఆడిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటే తన నాటకం బయటపడుతుందని ఓ పెద్ద డ్రామా ఆడి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. దమ్మాయిగూడకు చెందిన ప్రవీణ్ చెన్నైలో ఉంటూ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నానని తల్లిదండ్రులను నమ్మించాడు. ఇది నిజమేనని నమ్మిన అతని పేరేంట్స్ కొడుక్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే పెళ్లి చేసుకుంటే భార్యను లండన్ తీసుకెళ్లాలి.. అప్పుడు తాను ఆడుతున్న నాటకం తెలిసిపోతుందని భావించిన ప్రవీణ్ ఓ కొత్త డ్రామాకు తెరదీశాడు. లండన్ నుంచి వచ్చిన తనను శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఓ క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడని.. తనపై దాడి చేసి బంగారం, నగదును దోచుకెళ్లాడని తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు.

దీంతో ఆందోళనకు గురైన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రవీణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అయినప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో వారి దృష్టి ప్రవీణ్ మీదకు మళ్లింది. అతనిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా ప్రవీణ్ అసలు నిజం బయటపెట్టాడు. పెళ్లి ఇష్టం లేకే ప్రవీణ్ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తెలిపాడు. చెన్నైలో ఉంటూ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నానని తల్లిదండ్రులను మోసం చేసినట్లు తెలిపాడు.