భార్యతో అక్రమసంబంధం అనుమానం... నడిరోడ్డుపై స్నేహితున్ని వేటకొడవలితో నరికి...
భార్యతో అక్రమ సంబంధాన్ని కలిగివున్నాడన్న అనుమానంతో స్నేహితున్ని అత్యంత దారుణంగా నరికిచంపడానికి ప్రయత్నించాడో వ్యక్తి. ఈ దారుణం ఖమ్మంలో వెలుగుచూసింది.

ఖమ్మం : భార్యతో అక్రమ సంబంధాన్ని కలిగివున్నాడని అనుమానిస్తూ సొంత స్నేహితున్నే హతమార్చడానికి సిద్దమయ్యాడు ఓ వ్యక్తి. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపైనే స్నేహితున్ని వేట కొడవలితో నరికేసాడు. ఈ దారుణం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.... ఖమ్మం జిల్లా ఖానాపురంకు చెందిన నాగరాజు భార్యతో కలిసి కూరగాయాల వ్యాపారం చేసేవాడు. స్థానిక రైతు బజార్ లో కూరగాయలమ్మే వీరి వద్దకు స్నేహితుడు సతీష్ చారి వెళ్లేవాడు. ఈ క్రమంలో నాగరాజు భార్యతో సతీష్ మధ్య చనువు పెరిగింది. దీంతో వీరిపై నాగరాజుకు అనుమానం మొదలయ్యింది. తన భార్యను మాయమాటలతో లోబర్చుకున్న స్నేహితుడు అక్రమసంబంధాన్ని కొనసాగిస్తున్నాడని భావించాడు. దీంతో సతీష్ చారిని హత్యకు సిద్దపడ్డాడు నాగరాజు.
ఆటో డ్రైవర్ అయిన స్నేహితుడు సతీష్ ఖానాపురంలోని ఆటో అడ్డాలో వున్నట్లు నాగరాజు తెలుసుకున్నాడు. వేట కొడవలిని తీసుకుని అక్కడికి వెళ్లి ఆటో డ్రైవర్లు, ప్రజలు చూస్తుండగానే దాడికి దిగాడు. తప్పించుకునేందుకు పరుగుతీసిన సతీష్ ను వెంటపడిమరీ నరికాడు. దీంతో అతడి కాలితో పాటు ఒంటిపైన పలుచోట్ల గాయాలయ్యాయి. నాగరాజును స్థానికులు అడ్డుకోవడంతో సతీష్ ప్రాణాలతో బయటపడ్డాడు.
Read More పాస్‌పోర్టు రెన్యూవల్ కోసం అమెరికా నుంచి వచ్చి.. బాత్ రూంలో గుండెపోటుతో యువ టెక్కీ మృతి
స్నేహితుడిపై దాడి అనంతరం నాగరాజు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తీవ్ర గాయాలపాలైన సతీష్ స్థానికుల సాయంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు సమాచారం. బాధితుడి నుండి వివరాలు సేకరించిన పోలీసులు లిఖితపూర్వక ఫిర్యాదు స్వీకరించి నాగరాజుపై హత్యాయత్నంతో పాలు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.
భార్యతో పాటు స్నేహితున్ని చాలాసార్లు తీరు మార్చుకోవాలని హెచ్చరించినా వినలేదని... పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని నాగరాజు తెలిపాడు. అందువల్లే స్నేహితుడిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు నాగరాజు తెలిపాడు.