చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి ఇద్దరు మైనర్ బాలికలపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎడపల్లి మండలంలోని జంలం గ్రామానికి చెందిన నారాయణ (50) అనే వ్యక్తి గత పదిహేనేళ్లుగా జానకంపేటలోని అత్తగారింట్లో ఉంటున్నాడు. 

ఇంటి పక్కనే ఉండే ఇద్దరు చిన్నారులపై కన్నేసిన అతడు.. ఇటీవల వారికి చాక్లెట్‌ ఆశ చూపి సమీపంలోని పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితుల్లో ఒకరు ఎనిమిదేళ్ల చిన్నారి కాగా, మరొకరు ఏడేళ్ల పాప. మూత్ర విసర్జన సమయంలో తరచూ నొప్పి వస్తుండడంతో చిన్నారులు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు.

అసలేం జరిగిందని పెద్దలు ఆరా తీయగా, విషయం బయట పడింది. దీంతో ఆగ్రహోదగ్రులైన స్థానికులు ఆదివారం నారాయణను చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు. ఘటనా స్థలాన్ని రూరల్‌ సీఐ రవీందర్‌నాయక్, ఎస్సై ఎల్లాగౌడ్‌ పరిశీలించారు. బాధిత చిన్నారులను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.