తల్లి పక్కన ప్రశాంతంగా నిద్రపోతున్న చిన్నారిపై ఓ మృగాడి కన్నుపడింది. అభం, శుభం తెలియని నాలుగేళ్ల పసిదాన్ని దూరంగా తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం కారడివిలో చీకటిలో బాలికను అక్కడే వదిలేసి వచ్చాడు. ఈ దారుణ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోనంసేటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నాగారం గ్రామానికి చెందిన కొమరయ్య(36) ఒక జులాయి. ఖాళీగా ఉంటూ చెడు తిరుగుళ్లు తిరుగుతూ ఉంటాడు. కొంతకాలం క్రితం అతనికి అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహిత పరిచయం అయ్యింది. ఆమె భర్త చనిపోగా... నాలుగేళ్ల కుమార్తెతో ఒంటరిగా నివసిస్తోంది. 

కాగా... ఆమెతో కొమరయ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తరచూ ఆమె ఇంటికి వస్తూ వెళ్లేవాడు. కాగా... మంగళవారం రాత్రి కూడా అతను ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సదరు మహిళ తన నాలుగేళ్ల కుమార్తెతో కలిసి నిద్రిస్తోంది. అదే అదనుగా చేసుకున్న కొమరయ్య.. తల్లి పక్కన నిద్రపోతున్న నాలుగేళ్ల చిన్నారిని ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కొద్దిసేపటికి మహిళకు మెళకువ వచ్చి చూడగా... పక్కన చిన్నారి కనిపించలేదు. దీంతో.. చాలా ప్రాంతాల్లో వెతికింది. అయినా పాప ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం ఉదయం గ్రామానికి సమీపంలో గల అడవి నుంచి ఏడుపు వినిపించడంతో వెళ్లి చూడగా చిన్నారి కన్పించింది. శరీరంపై గాయాలున్నాయి.  చిన్నారి మాటల ద్వారా పోలీసులు విషయం తెలుసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడు కొమురయ్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

మంగళవారం రాత్రి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఐదేళ్ల చిన్నారిపై 12 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోతనకాలనీలోని ఒకే బ్లాక్‌లో ఉండే రెండు కుటుంబాలకు చెందిన చిన్నారులు ఆడుకునే క్రమంలో బాలుడు చిన్నారిపై లైంగిక దాడికి యత్నించాడు. భయంతో చిన్నారి ఏడ్చుకుంటూ వచ్చి తల్లిదండ్రులకు చెప్పింది. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.