హైదరాబాద్ చందానగర్‌లో ఓ  కుటుంబం  మరణాల వెనక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్యపై అనుమానంతోనే భర్త ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. 

హైదరాబాద్ చందానగర్‌లో ఓ కుటుంబం మరణాల వెనక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్యపై అనుమానంతోనే భర్త ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. భార్య, ఇద్దరు పిల్లలను కత్తెరతో పొడిచి.. ఆ తర్వాత భర్త ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు.. సంగారెడ్డి జిల్లా కోహీర్‌కు చెందిన నాగరాజు, తన భార్య సుజాత‌తో కలిసి ఏడేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. చందానగర్ సమీపంలోని పాపిరెడ్డి నగర్‌లో రాజీవ్ గృహకల్ప మొదటి అంతస్తులో నివాసం ఉంటున్నారు. 

నాగరాజు చందానగర్ సమీపంలోని నివాస ప్రాంతాల్లో బ్రెడ్, మసాలా దినుసులను విక్రయించేవాడు. అతని భార్య సుజాత టైలర్‌ పని చేస్తూ.. చిన్నమొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చేది. వీరికి ఇద్దరు పిల్లలు.. కొడుకు సిద్దప్ప (11), రమ్య (7) ఉన్నారు. పిల్లలు స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నారు. 

అయితే గత రెండు మూడు రోజులుగా వారు ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. సోమవారం ఉదయం వారి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ముందుగా కిటికీని పగులగొట్టారు. ఇద్దరు పిల్లలు, తల్లి మంచం మీద పడిపోయి ఉండటం గమనించారు. దీంతో వెంటనే క్లూస్ టీమ్‌కు సమాచారం అందించారు. అనంతరం క్లూస్ టీమ్ సమక్షంలో.. ఇంటి తలుపు సెంట్రల్ లాక్‌ను పగులగొట్టారు. 

అనంతరం లోపలికి వెళ్లి చూడగా.. నాగరాజు సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సమీపంలోని మంచం మీద సుజాత, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారి ఒంటిపై అనేక కత్తిపోట్లు కూడా ఉన్నాయి. అయితే ఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు చెప్పారు. అయితే ఇరుగుపొరుగు వారి ఇచ్చిన సమాచారం ఆధారంగా.. భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు. నాగరాజు గత రెండు నెలలుగా పని చేయడం లేదని, మద్యానికి బానిసయ్యాడని చెప్పారు. 

సుజాత వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించి నాగరాజు ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. తొలుత భార్య, పిల్లలకు విషమిచ్చి.. ఆ తర్వాత కత్తెరతో దాడి చేసి హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సుజాత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.