తాగుడుకు డబ్బులివ్వలేదని కన్న తల్లినే గొంతు నులిమి చంపాడో కసాయి కొడుకు. తాగుడుకు బానిసై కిరాతకానికి ఒడిగట్టాడు. నవమాసాలు మోసి కన్న తల్లినే కర్కశంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండలం అంబం గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. 

అంం గ్రామానికి చెందిన చిలపల్లి సాయవ్వ (65)కు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు చిన్న సాయిలు తాగుడుకు బానిసయ్యాడు. సాయిలుకు పెళ్లై, ఇద్దరు పిల్లలున్నారు. అయినా తాగుడు అలవాటు మానలేదు. నిత్యం కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. దీంతో ఆయన భార్య గౌరవ్వ కూతురు, కొడుకుని తీసుకుని ఐదేళ్ల క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది. 

అప్పటి నుంచి సాయిలు తల్లి దగ్గరే ఉంటున్నాడు. నిత్యం తల్లిని డబ్బుల కోసం వేధించేవాడు. రోజూ మద్యం తాగి వచ్చి తల్లితో, గ్రామస్తులతో గొడవకు దిగేవాడు. అలాగే 
మంగళవారం రాత్రి కూడా తల్లితో గొడవ పడి ఆమెపై చేయి చేసుకున్నాడు. తెల్లవారేసరికి ఆమె విగతజీవిగా పడి ఉంది. 

దారుణం : ఆస్తి రాసిస్తేనే తలకొరివి.. చనిపోయిన తల్లికి ఓ కొడుకు సత్కారం...

అయితే, తనకేమీ తెలియనట్టుగా తల్లి చనిపోయిందని బంధువులకు చెప్పాడు. సాయిలు సంగతి తెలిసిన సాయిలు వదినకు అనుమానం వచ్చింది. సాయిలే సాయవ్వను గొంతు నులిమి చంపాడంటూ  వదిన అనుషవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరిశీలించిన పోలీసులు కూడా గొంతు నులమినట్టుగా ఉందని నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.