కన్నతల్లి చనిపోయిందన్న బాధ లేదు.. ఆమె అంతిమయాత్ర ప్రశాంతంగా జరపాలన్న సోయి లేదు. చిన్న కొడుకుగా తల్లికి చేయాల్సిన పనులు పూర్తి చేయాలన్న బాధ్యత లేదు. తల్లిపేరిట ఉన్న ఆస్తి ఇస్తే కానీ తలకొరివి పెట్టనంటూ బేరం పెట్టాడో ప్రబుద్ధుడు. ఈ హేయమైన సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెడితే.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధి జీల్గుల గ్రామంలో బుధవారం ఓ కొడుకు తల్లి అంత్యక్రియలను అడ్డుకున్నాడు. తల్లి పేరిట ఉన్న భూమిని రాసిచ్చే వరకు తలకొరివి పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. 

జీల్గుల గ్రామానికి చెందిన తంగెళ్లపల్లి సారయ్య–రాజమ్మ(70) దంపతులకు ముగ్గురు కొడుకులు. కొద్ది రోజుల క్రితమే భర్త సారయ్యతో పాటు పెద్ద కొడుకు సమ్మయ్య అనారోగ్యంతో మృతిచెందారు. ప్రస్తుతం రెండో కొడుకు జంపయ్య, చిన్న కొడుకు రవీందర్‌ ఉన్నారు. భర్త, కొడుకు చనిపోయాక ఆస్తి పంపకాలు చేశారు. దీంట్లో రాజమ్మ పేరిట ఎకరన్నర భూమి ఉంది. 

వృద్ధాప్యంతో రాజమ్మ బుధవారం రాజమ్మ మృతి చెందింది. తల్లికి సంప్రదాయం ప్రకారం చిన్నకొడుకు రవీందర్‌ కర్మకాండలు నిర్వహించాల్సి ఉండగా.. అతడు అంగీకరించలేదు. తల్లి పేరు మీద ఉన్న భూమిని తనకు రాసిస్తేనే తలకొరివి పెడతానని మొండిపట్టు పట్టుకుని కూర్చున్నాడు. 

దీంతో తల్లి మృతదేహం ముందే కొడుకులిద్దరూ గొడవకు దిగారు. గ్రామస్తులు, పోలీసులు చెప్పినా కూడా రవీందర్‌ వినలేదు. దీంతో రెండో కొడుకు కుమారుడు జంపయ్య తన తల్లికి అంత్యక్రియలు పూర్తిచేశాడు.