అనుమానం అతనిలోని మనిషిని చంపేసింది. భార్య పై అతనిలో మొదలైన అనుమానం పెనుభూతంగా మారింది. ఈ క్రమంలో కట్టుకున్న భార్యను, పిల్లనిచ్చిన మామను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బాలంపేటలో మంగళవారం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బాలంపేట గ్రామానికి చెందిన అబ్దుల్ గపూర్ మియా తన చిన్న కుమార్తె హాజీ బేగం(32) ను 14 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కి చెందిన ఖలీంకి ఇచ్చి పెళ్లి జరిపించారు. అతను అక్కడే సైకిల్ మెకానిక్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా.. వీరికి ముగ్గురు మగ పిల్లలు కూడా ఉన్నారు.

అయితే.. ఈ మధ్య భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో.. హాజీ బేగం పిల్లలతో కలిసి దాదాపు 8 నెలల క్రితం పుట్టింటికి వచ్చేసింది. దీంతో.. భార్యను తన ఇంటికి తెచ్చుకునేందుకు ఇటీవల ఖలీం మామ గారి ఇంటికి వెళ్లాడు. అక్కడ భార్యభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.

భార్యను ఇంటికి రావాల్సిందిగా కోరగా ఆమె నిరాకరించింది. దీంతో.. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అందుకే తనతో రావడం లేదంటూ తనలోని అనుమానం బయటపెట్టాడు. ఈ క్రమంలో గొడవ మరింత పెద్దదైంది. ఈ క్రమంలోనే భార్యను అతి కిరాతకంగా నరికి చంపేశాడు. కాగా.. ఆమెను కాపాడుకునేందుకు తండ్రి అబ్దుల్ గపూర్ మియా ప్రయత్నించగా.. అతనికి కూడా అతి దారుణంగా నరికి చంపేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.