జీవితాంతం తోడు ఉంటానని మాట ఇచ్చిన భర్తే.. ఆమె పాలిట మృత్యుపాశంగా మారాడు. కట్టుకున్న భర్తే.. ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ దారుణాన్ని కూతురు కళ్లారా చూడటంతో.. ఆమెను కూడా అంతే దారుణంగా చంపేశాడు. ఈ దారుణ సంఘటన వరంగల్ నగరంలోని ఉర్సు గుట్ట ప్రాంతంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వరంగల్ లోని బీఆర్ నగర్ కు చెందిన వెంకటేశ్వర్లు ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పది సంవత్సరాల క్రితం రమ్య(29)తో వివాహమైంది. వ్యాపారాల పేరుతో అప్పులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వెంకటేశ్వర్లు మద్యానికి బానిసగా మారాడు.

తరచూ భార్యతో  గొడవపడుతూ ఆమెను మరింత ఇబ్బందులకు గురిచేసేవాడు. కాగా.. కొద్దిరోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. కాగా.. భార్య వద్దకు వెళ్లి.. తాను మారిపోయానని.. ఇక నుంచి బుద్దిగా ఉంటానని నమ్మించాడు. అతని మాటలు నిజమని నమ్మి.. కూతురితో కలిసి భర్తతో పాటు ఇంటికి వెళ్లింది.

అయితే... ఆదివారం ఉదయం మద్యం మత్తులో వెంకటేశ్వర్లు మరోసారి రమ్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో భార్య గొంతు నులిమి హత్య చేశాడు.ఈ దారుణాన్ని కూతురు కళ్లారా చూడటంతో కుమార్తె మనస్విని(8) ని కూడా  హత్య చేశాడు. కాగా.. రమ్య ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం కలిగిన స్థానికులు.. ఇంట్లోకి వెళ్లి చూడగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా.. భర్త వెంకటేశ్వర్లుని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.