అత్తా, కోడళ్ల మధ్య జరిగిన గొడవ.. చివరకు కొడుకు చేతిలో తల్లి ప్రాణాలు పోయేదాకా దారితీసింది. ఈ సంఘటన వనపర్తిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గోపాలపేట మండలం పొలికెపాడు గ్రామానికి చెందిన మంకలి నర్సయ్య, కాశమ్మ దంపతులకు కురుమయ్య, శివ ఇద్దరు కుమారులున్నారు. శివకు ఎనిమిది నెలల క్రితం అదే గ్రామానికి చెందిన రేణుకతో వివాహం జరిగింది. ఇటీవల అత్త కాశమ్మకు, కోడలు రేణుక మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కూడా ఏదో విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో మనస్తాపం చెందిన కాశమ్మ ఆత్మహత్య చేసుకునేందుకు ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. ఇది గమనించిన కోడలు.. అత్త చేతిలోని అగ్గిపెట్టె లాక్కొని ఆపింది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన కాశమ్మ కుమారుడు శివ ఇంట్లో ఉన్న గొడ్డలితో తల్లి మెడపై నరికేశాడు.

ఆమెపై కుప్పకూలి రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్సై రామన్ గౌడ్ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకొని నిందితుడు శివ, ఆయన భార్య రేణుకను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.