ఆస్తి కోసం ఓ వ్యక్తి జన్మనిచ్చిన కన్న తండ్రినే అతి దారుణంగా హత్య  చేశాడు. ఉరివేసి.. ఆ తర్వాత నోట్లో పరుగుల మందు పోసి... ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చేవెళ్ల మండలంలోని ఎన్కేపల్లి గ్రామానికి చెందిన బొమ్మిడి బుచ్చిరెడ్డి(55) కి విక్రంరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి కొడుకులు. బుచ్చిరెడ్డి తండ్రి చిన్న నారాయణ రెడ్డి తమకున్న ఆస్తిలో  మూడెకరాలు అదే గ్రామానికి చెందిన వారికి కొన్నేళ్ల క్రితం ఉచితంగా దానమిచ్చాడు. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.లక్ష పలుకుతోంది.

ఈ నేపథ్యంలో బుచ్చిరెడ్డి కొడుకులు ఆ భూమి తమకే చెందుతుందని కోర్టులో కేసు వేశారు. ఈ విషయంలో తండ్రి, కొడుకుల మధ్య దూరం పెరిగింది. తగాదాలు కూడా పెరిగిపోయాయి. ఈ క్రమంలో తండ్రి బతికి ఉంటే... తమకు మిగిలిన ఆస్తి కూడా దక్కదనే భావన పెద్ద కుమారుడు విక్రమ్ రెడ్డిలో కలిగింది. తండ్రిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

తన తోడల్లుడు దామోదర్ రెడ్డి, మామ నారాయణరెడ్డి తో కలిసి తండ్రిని చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్లాన్ ప్రకారం బుచ్చిరెడ్డిని మద్యం తాగుదామని పొలానికి పిలిచారు. బుచ్చిరెడ్డి మందు తాగి మత్తులోకి జారుకోగానే... మెడకు టవల్ చుట్టి బిగించాడు. టవల్ తో ఉరిలాగా బిగించి... ఊపిరాడకుండా చేశాడు. ఆ తర్వాత నోట్లో పురుగుల మందు పోసి ఆత్మహత్య అని నమ్మించడానికి ప్రయత్నించారు.

తొలుత పోలీసులు కూడా ఆత్మహత్య గానే కేసునమోదు చేశారు. తర్వాత పోస్టు మార్టంలో మెడకు ఉరివేయడం వల్ల చనిపోయాడని తేలడంతో... పోలీసుల అనుమానం కొడుకుపై వెళ్లింది. పోలీసులు తమదైన రీతిలో విచారించగా... తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు నిందితిడిని, అతనికి సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.