హైదరాబాద్: భర్తను, పిల్లలను వదిలేసి వచ్చిన మహిళను ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. శవంతో పాటు రెండు రోజులు ఉండి ఆ తర్వాత పారిపోయాడు. వనమూలికలతో వైద్యం పేర మాయమాటలు చెప్పి అతను ఆమెను తన వెంట తీసుకుని వచ్చి వేరే కాపురం పెట్టాడు. 

ఆమెను తాగిన మత్తులో అతను కొట్టి చంపేశాడు. ఈ దారుణం ఈ నెల 3వ తేదీన హైదరాబాదులోని కెపిహెచ్ బీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ లక్ష్మినారాయణతో కలిసి ఏసీపీ సురేందర్ రావు ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను మీడియా ప్రతినిధులకు చెప్పారు 

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మడలం చింతోని చిలక గ్రామానికి చెందిన కుంపటి వెంకటనారాయణ (38) అలియాస్ వెంకటేశ్వర్లు ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అతను భార్యను వదిలేశాడు. 

ఆయుర్వేద వైద్యం నేర్చుకుని గ్రామాలు తిరుగుతూ మందులు విక్రయించేవాడు. ఓ రోజు బస్సులో అతనికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్ నగర్ కు చెందిన స్రవంతి (30) పరిచయమైంది. ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకునే వరకు వారి పరిచయం పెరిగింది. 

వెంకటనారాయణ మాటలకు ఆకర్షితురాలైన స్రవంతి భర్తను, ఇద్దరు పిల్లలను వదిలేసి అతనితో వెళ్లిపోయింది. కొద్ది కాలం వారిద్దరు పెద్దపల్లిలో ఉన్నారు. 2020లో హైదరాబాద్ వచ్చి అమీర్ పేటలో ఉంటూ ఔషధాలు విక్రయిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఎస్ఎస్ కాలనీలో మరో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. 

ఈ నెల 3వ తేదీన వెంకటనారాయణ తాగి ఇంటికి వచ్చాడు. దాంతో స్రవంతి అతనితో గొడవ పడింది. దాంతో అతను రోకలిబండతో ఆమెను మోదాడు. దీంతో స్రవంతి అక్కడికక్కడే మరణించింది. ఆ రాత్రంతా అతను శవంతోనే ఉన్నాడు. 4వ తేదీన ఇంటి అద్దె చెల్లించి అక్కడే ఉన్నాడు. 

ఈ నెల 5వ తేదీ తెల్లవారు జామున శవాన్ని భవనం ప్రహరీగోడ పక్కన పడేసి దుప్పటి కప్పి గతంలో ఎల్లారెడ్డిగూడలో ఉన్న ఇంట్లోని మూడో అంతస్తులోకి చేరాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సోమవారం ఉదయం పోలీసులు వెంకటనారాయణను అదుపులోకి తీసుకున్నారు. స్రవంతి వివరాల ఆధారంగా ఆమె భర్తను పిలిపించి మృతదేహాన్ని అప్పగించారు.